Begin typing your search above and press return to search.

రాజమౌళికి షాకిచ్చిన సూర్య

By:  Tupaki Desk   |   17 April 2016 2:52 PM IST
రాజమౌళికి షాకిచ్చిన సూర్య
X
అవును.. మిస్టర్ సూర్య రాజమౌళికి షాకిచ్చాడు. ఈ సూర్య దెబ్బకు నిర్విరామంగా సాగుతున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ షూటింగుకి బ్రేక్ పడింది. దాదాపు నెల రోజుల పాటు యూనిట్ అంతా పని మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ బాహుబలి సినిమాకు.. సూర్యకు ఏం సంబంధం అంటారా..? ఇక్కడ మాట్లాడుతోంది తమిళ సూపర్ స్టార్ సూర్య గురించి కాదండోయ్. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇండియా మొత్తాన్ని తన వేడితో అల్లాడించేస్తున్న ‘సూర్య’ గురించి. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటలు దాటితే.. మళ్లీ సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లోనూ మొండిగా షూటింగ్ చేద్దామని చూశాడు రాజమౌళి. రామోజీ ఫిలిం సిటీలో అందుకోసం భారీ ఏర్పాట్లే జరిగాయి. యూనిట్ సభ్యులందరికీ టెంట్లు.. కూలర్లు.. ఏసీలు.. ఏర్పాటు చేసి.. యూనిట్లోని ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకుంటూ షూటింగ్ చేస్తున్నా సరే.. ఎండ దెబ్బకు తట్టుకోవడం కష్టంగా ఉంది మరి. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ కొనసాగించడం చాలా కష్టమని భావించి.. ఓ నెల రోజుల పాటు బ్రేక్ ఇద్దామని నిర్ణయించుకున్నాడట జక్కన్న. అందరితో చర్చించి యూనిట్ మొత్తానికి నెల రోజులు సెలవులు ప్రకటించాడట. విరామం తర్వాత ఈ గ్యాప్ ను కవర్ చేసేలా టైట్ షెడ్యూళ్లు ప్లాన్ చేశారట. ఈ ఎఫెక్ట్ మళ్లీ రిలీజ్ డేట్ మీద పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాకే సెలవులు ప్రకటించాడట జక్కన్న.