Begin typing your search above and press return to search.

చరణ్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రాజమౌళి

By:  Tupaki Desk   |   9 April 2020 1:00 PM
చరణ్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రాజమౌళి
X
మొత్తానికి సస్పెన్సుకు తెర పడ్డట్లే ఉంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'ఆచార్య'లో ఆయన తనయుడు రామ్ చరణ్ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని మెగాస్టారే స్వయంగా ధ్రువీకరించినట్లు వార్తలొస్తున్నాయి. చరణ్‌ను ఈ సినిమా లో నటింపజేసేందుకు అనుమతించాలని.. 'ఆర్ ఆర్ ఆర్' నుంచి నెల రోజుల పాటు అతడికి విరామం ఇవ్వాలని దర్శకుడు రాజమౌళిని చిరు అడగ్గా ఆయన అంగీకరించాడట. కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక చరణ్ నేరుగా 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్‌కు వెళ్లకుండా 'ఆచార్య' కోసం పని చేసే అవకాశముంది. ఈ సిినిమాలో తమవి తండ్రీ కొడుకుల పాత్రలు కావాలని.. గురు శిష్యుల్లా ఉంటామని చిరు అంటున్నాడు. చరణ్ చేయబోయే పాత్ర నిడివి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుందని చిరు ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. తామిద్దరం కలిసి నటించాలని తన భార్య సురేఖ కోరుకున్నట్లు కూడా చిరు చెప్పాడు.

ఇదిలా ఉండగా ఈ ప్రత్యేక పాత్రకు ముందు రామ్ చరణ్‌ నే అనుకున్నారు. కానీ మధ్యలో మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది. కానీ నాటకీయ పరిణామాల మధ్య అతడి పేరు వెనక్కి వెళ్లిపోయింది. మహేష్ మరీ ఎక్కువ పారితోషకం అడగడంతో బడ్జెట్ పెరిగిపోతుందని భావించి అతడి పేరును పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఒక దశలో ఈ పాత్రకు అల్లు అర్జున్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ అతడిని తీసుకునే విషయంలో ఏం జరిగిందో ఏమో. చిరు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినపుడు మాత్రం ముందు నుంచి చరణ్ పేరే చర్చల్లో ఉందన్నాడు. మహేష్ పేరు ఎలా ప్రచారంలోకి వచ్చిందో తెలియదన్నాడు. రాజమౌళి - కొరటాల మధ్య అవగాహన కుదిరితే చరణ్ ఈ సినిమాలో నటిస్తాడన్నాడు. ఇంతకుముందు చరణ్ నటించిన 'మగధీర' - 'బ్రూస్ లీ' సినిమాల్లో చిరు కాసేపు కనిపించాడు. చిరు చేసిన 'ఖైదీ నంబర్ 150'లో చరణ్ ఒక పాటలో తళుక్కుమన్నాడు. ఐతే వీళ్లిద్దరూ కలిసి పూర్తి స్థాయిలో స్క్ర్రీన్ షేర్ చేసుకోబోతుండటం మాత్రం ఇదే తొలిసారి.