Begin typing your search above and press return to search.

జక్కన్న చెబుతోంది ‘గరుడ’ గురించేనా?

By:  Tupaki Desk   |   26 Oct 2015 9:48 AM IST
జక్కన్న చెబుతోంది ‘గరుడ’ గురించేనా?
X
‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి రేంజే మారిపోయింది. ఇప్పుడతను కేవలం ఓ తెలుగు డైరెక్టర్ కాదు. అతడి సినిమా వస్తోందంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆసక్తిగా చూసే రోజులు పోయాయి. రాజమౌళి ప్రతి అడుగునూ మొత్తం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు గమనిస్తున్నారిప్పుడు. ఇంతకుముందులా చిన్న, మీడియం సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. జక్కన్న సినిమా అంటే ఇక వందల కోట్లతో ముడిపడ్డ వ్యవహారమే. గతంలో ‘మగధీర’ తర్వాత మర్యాద రామన్న చేసినట్లు చిన్న సినిమాలు చేసే అవకాశాలు ఇకపై లేనట్లే. జక్కన్న ఆలోచనలు కూడా అందుకు తగ్గట్లే భారీగా ఉన్నాయి.

బాహుబలి-2 తర్వాత కూడా అదే తరహాలో మరో భారీ సినిమా చేయడానికే సిద్ధమవుతున్నట్లున్నాడు జక్కన్న. బాహుబలి ప్రపంచం కొనసాగుతుందని నిన్న చేసిన ట్వీట్ ను బట్టి చూస్తే జక్కన్న మదిలో భారీ ఆలోచనలే ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ‘గరుడ’నే జక్కన్న తర్వాతి సినిమాగా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ లో రాజమౌళి ‘గరుడ’ అనే భారీ సినిమా తీయబోతున్నాడని.. అది బాహుబలిని తలదన్నేలా ఉంటుందని.. దానికి విజయేంద్ర ప్రసాద్ కథ కూడా సిద్ధం చేశాడని కొన్ని నెలల కిందటే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలితో సంబంధం లేకుండా బాహుబలి-3 ఉంటుందన్న జక్కన్న ట్వీట్ ఈ సినిమా గురించే అన్నది దాదాపుగా ఖాయమే.