Begin typing your search above and press return to search.

రాజమౌళి చెప్పుకోరు .. ఆయన గొప్పతనం అదే!

By:  Tupaki Desk   |   31 Jan 2022 8:30 AM GMT
రాజమౌళి చెప్పుకోరు .. ఆయన గొప్పతనం అదే!
X
తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకుని వెళ్లిన దర్శకుడిగా రాజమౌళి కనిపిస్తారు. 'శాంతినివాసం' వంటి సీరియల్స్ నుంచి సినిమాల వైపుకు వచ్చిన రాజమౌళి, ఈ రోజున దేశం గర్వించదగిన దర్శకులలో ఒకరిగా నిలిచారు. రాజమౌళి అనేది ఒక పేరు కాదు .. ఒక బ్రాండ్ అనేంతగా ఆయన ఎదిగారు. అయినా ఆయన ఎక్కడ చూసినా .. ఎప్పుడు చూసినా చాలా సింపుల్ గా కనిపిస్తుంటారు. ప్రతి విషయంలోను ఆయన చాలా నిబ్బరంగా .. నిండుగా కనిపిస్తూ, ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఆయన ఎక్కువగా స్పందిస్తుంటారు.

అలాగే ఇతరులకు సహాయ సహకారాలను అందించే విషయంలోను ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. ఒక మంచి పనిలో తనతో పాటు మరింతమంది పాల్గొనేలా ఆయన చురుకైన పాత్రను పోషిస్తుంటారు. అలా ఇటీవల ఆయన 'దేవిక' విషయంలో స్పందించారు. 'బాహుబలి' సినిమాకి కో ఆర్డినేటర్ గా పనిచేసిన దేవిక కొంతకాలంగా 'బ్లడ్ కేన్సర్' తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు ఆమె స్థాయికి మించిపోయింది. అందువలన ఇతురుల సాయం ఆమెకి అవసరమైంది. ఈ సమయంలోనే రాజమౌళి ఆమెకి సాయపడమంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు.

అయితే రాజమౌళి మంచి మనసుతో చేసిన ఈ రిక్వెస్ట్ ను కొంతమంది మరోలా అర్థం చేసుకున్నారు. రాజమౌళి వంటి ఒక పెద్ద డైరెక్టర్ ఒక కేన్సర్ బాధితురాలికి పూర్తిస్థాయి ట్రీట్మెంట్ ను ఇప్పించలేరా? ఆ మాత్రం ఖర్చును ఆయన ఒక్కరు భరించలేరా? అంటూ విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై రాజమౌళి స్పందించలేదు. 'అన్ స్టాపబుల్' టాక్ షో లో రాజమౌళి పాల్గొనగా ఆ వేదికపై బాలకృష్ణ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. 'బసవతారకం కేన్సర్ హాస్పిటల్'కి రాజమౌళి ఎన్నోసార్లు విరాళాలను అందించారు. అయితే ఆ విషయాలను .. వివరాలను బయటికి చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు.

అలాగే దేవిక కేన్సర్ ట్రీట్మెంట్ కి తనవంతు సాయాన్ని రాజమౌళి అందించారు. ఆ తరువాతనే ఆయన ఇతరులను రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంలో రాజమౌళి గారిని విమర్శించడం కరెక్ట్ కాదని అనిపించడం వల్లనే ఈ రోజున ఈ వేదిక ద్వారా నేను చెబుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. రాజమౌళి రిక్వెస్ట్ కారణంగా దేవిక ట్రీట్మెంట్ కోసం ఇంతవరకూ 40 లక్షలకి పైగా సమకూరాయట. రాజమౌళి ఎంత మానవతా హృదయంతో స్పందిస్తారనేది ఈ టాక్ షో ద్వారా .. బాలకృష్ణ ద్వారా బయట ప్రపంచానికి తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాజమౌళిని విమర్శించినవారు సైతం ప్రశంసించకుండా ఉండలేరు.