Begin typing your search above and press return to search.

హీరోల్ని చూసి జనాలు వస్తారు కాని..

By:  Tupaki Desk   |   6 July 2015 7:24 AM GMT
హీరోల్ని చూసి జనాలు వస్తారు కాని..
X
సినిమా ప్రపంచం ఫక్తు ఈగోయిస్టిక్‌ ప్రపంచం. ఇక్కడ ఎవరూ ఎవరినీ ఏమీ అనకూడదు. నిజాల్ని ఉన్నదున్నట్టు మాట్లాడకూడుదు. ఏదీ కెలక్కూడదు. ఒకవేళ హర్టయితే, అలాంటివి మనసులో పెట్టుకుంటారు. ముఖ్యంగా స్టార్‌ హీరోలు అని చెప్పుకునేవాళ్లకే ఇలాంటి ఈగోలెక్కువ. అయితే ఎవరి ఈగో ఎలా ఉంటే నాకేంటి అనుకున్నారో ఏమో! ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన మనసులో ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. హీరోలు ఏం పీకుతారు? అన్నట్టే మాట్లాడారీ సీనియర్‌ డైరెక్టర్‌.

హీరోలు జనాల్ని థియేటర్లకు రప్పించగలరే కానీ, ఆద్యంతం చివరివరకూ సినిమా చూసేలా సీట్‌లో కూచోబెట్టగలరా? అని సూటిగా ప్రశ్నించారు జక్కన్న. అంతేనా నటీనటులు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సేమ్‌ టు సేమ్‌. నటుడిలానే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా స్టార్‌తో సమానం. ఏ హీరో నటించినా కంటెంట్‌ చాలా ముఖ్యం. అది లేకపోతే పనవ్వదు. కంటెంట్‌ లేని సినిమా ఆడదు. నా వరకైతే నేను క్రియేట్‌ చేసిన డ్రామా ఆడియెన్‌ని కుర్చీలో కూచోబెట్టగలదు. నేను గొప్ప ఫిలింమేకర్‌ని అని డబ్బాలు కొట్టను కానీ, ఎమోషన్‌ పీక్స్‌లో చూపించగలనన్నది నమ్ముతాను.. అంటూ తన మనసులో ఉన్న మాటని సూటిగా బైటికే అనేశాడు. జనాల్ని థియేటర్లకు రప్పించినంత మాత్రాన వారిని చివరివరకూ హీరోలే కూచోబెట్టలేరన్న సందేశాన్ని జనాల్లోకి పంపారు. దటీజ్‌ జక్కన్న.