Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి శిష్యుల‌కే ఎందుకీ గ‌తి?

By:  Tupaki Desk   |   11 Oct 2015 1:30 PM GMT
రాజ‌మౌళి శిష్యుల‌కే ఎందుకీ గ‌తి?
X
టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల శిష్యులెవ‌రూ స్టార్ డైరెక్ట‌ర్లుగా ఎద‌గ‌లేక‌పోయార‌న్న అప‌ప్ర‌ద ఉంది. ఏవో ఒక‌టి రెండు సినిమాలు చేసి స‌రిపెట్టుకుని వెళ్లిపోయారే త‌ప్ప పెద్ద‌గా స్టార్‌ డ‌మ్ సంపాదించి రేసులో కొన‌సాగలేక‌పోయార‌న్న విమ‌ర్శ ఉంది.

ముఖ్యంగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు శిష్యుడిగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌క‌త్వంలో అడుగుపెట్టిన ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. బాహుబ‌లి చిత్రంతో అసాధార‌ణ విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కుడిగా చ‌రిత్ర సృష్టించాడు. అయితే రాజ‌మౌళి శిష్యుల్లో ఎంత‌మంది స్టార్ డైరెక్ట‌ర్లు అయ్యారు? అంటే జీరో అన్న స‌మాధాన‌మే. ఇది నిజంగానే ఓ స్టార్ డైరెక్ట‌ర్‌కి అప‌ప్ర‌ద లాంటిదే. గురువును మించిన శిష్యులు పుట్టుకు రావాలే కానీ, జీరోలు పుట్టుకు రాకూడ‌దు క‌దా?

రాజమౌళి శిష్యుల్లో క‌ర‌ణ్ కుమార్‌ - మ‌హ‌దేవ ద‌ర్శ‌కులుగా మారి సినిమాలు తెర‌కెక్కించారు. నితిన్ హీరోగా ద్రోణ చిత్రాన్ని తెర‌కెక్కించాడు క‌ర‌ణ్ కుమార్‌. నేరేష‌న్ ఫెయిల్యూర్ ఈ సినిమాలో స్ప‌ష్టం గా క‌నిపించింది. దాంతో ద‌ర్శ‌కుడిలో విష‌యం లేద‌ని తేల్చేసింది ఇండ‌స్ర్టీ. ఆ త‌ర్వాత అత‌డికి ఛాన్సులే లేవు. అలాగే బాల‌కృష్ణ హీరోగా మిత్రుడు చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌హ‌దేవ ద‌ర్శ‌కుడిగా అట్ట‌ర్‌ఫ్లాప‌య్యారు. అయితే ఇప్పుడు మ‌రో కొత్త ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కొలువు నుంచి అదృష్టం ప‌రీక్షించుకునేందుకు వ‌స్తున్నాడు.

రాజ‌మౌళి శిష్యుడు జ‌గ‌దీష్ త‌ల‌సిల... ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది అనే చిత్రాన్ని తెర‌కెక్కించి జ‌నాల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పోస్ట‌ర్లు - టైటిల్ ప్ర‌తివిష‌యంలో క్రియేటివిటీ అయితే క‌నిపిస్తోంది. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టే సినిమా హిట్ట‌యితే ఇత‌డి హ‌వా సాగే ఛాన్సుంది. ఈ సినిమా ఆడియోని జ‌క్క‌న్న స్వ‌యంగా రిలీజ్ చేయ‌బోతున్నారు. జ‌గ‌దీష్ హిట్ కొడ‌తాడా? లేదా? గురువు పేరు నిల‌బెడ‌తాడా? లేదా? ఏం జ‌రుగుతుందో వెయిట్ అండ్ సీ.