Begin typing your search above and press return to search.

చిరంజీవి సీన్ పై అసంతృప్తితోనే చరణ్ తో అలాంటి సన్నివేశం: రాజమౌళి

By:  Tupaki Desk   |   16 Nov 2021 5:27 PM IST
చిరంజీవి సీన్ పై అసంతృప్తితోనే చరణ్ తో అలాంటి సన్నివేశం: రాజమౌళి
X
దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన దర్శకధీరుడు రాజమౌళి.. ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు. విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న.. హీరో ఎలివేషన్‌ సీన్స్‌ - ఎమోషనల్‌ సన్నివేశాలను వెండితెర మీద ఆవిష్కరించడంలో తనకు సాటిలేరనిపించుకున్నారు. అయితే ఆయన కొన్ని సన్నివేశాలను ఇతర చిత్రాల నుంచి స్పూర్తి పొంది తీస్తారనే టాక్ ఉంది. ఫలానా సినిమాలోని ఆ సీన్ నుంచి స్పూర్తి పొందారని కామెంట్స్ వచ్చినా.. రాజమౌళి ఆ సన్నివేశాన్ని చెక్కిన విధానం వల్ల సినీ అభిమానులు అవేమీ పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే రామ్‌ చరణ్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' చిత్రంలోని ఓ సన్నివేశం తీయడానికి.. 'కొదమ సింహం' చిత్రమే కారణమని ఇటీవల దర్శకధీరుడు తెలిపారు. చరణ్ ఇసుకలో కూరుకుపోతే అతని గుర్రం వచ్చి కాపాడే సీన్ సినిమాలో హైలైట్ గా నిలిచిన సీన్స్ లో ఒకటని చెప్పవచ్చు. ఇలాంటి సన్నివేశం చిరంజీవి హీరోగా నటించిన 'కొదమ సింహం' సినిమాలో ఉంటుంది. మెగాస్టార్ ను ఇసుక తిన్నెలో గొంతు వరకు పూడ్చబడి ఉండగా.. విజిల్ వేయగానే తన గుర్రం వచ్చి కాపాదుతుంది. అయితే ఈ సీన్ పై అసంతృప్తి చెందడం వల్ల 'మగధీర' లో ఆ సీన్ ని తనదైన శైలిలో తీసినట్లు రాజమౌళి వెల్లడించారు.

ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. అప్పట్లో థియేటర్ లో 'కొదమసింహం' సినిమా చూస్తున్నా. అందులో రౌడీలు చిరంజీవి ని గొంతు వరకు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. అప్పుడు ఆయన గుర్రం వచ్చి ఆయన నోటికి తాడు అందించి కాపాడుతుంది. ఆ సీన్‌ చూసి ఎమోషనల్ అయ్యా. అయితే అంత కష్టంలో నుంచి బయటకు వచ్చిన ఆయనకు, గుర్రానికీ మధ్య అనుబంధం చూపించకపోవడంతో చాలా నిరుత్సాహ పడిపోయాను''

''నా దృష్టిలో అక్కడ అది గుర్రం కాదు. ప్రాణాలు కాపాడిన ఒక వ్యక్తి.. స్నేహితుడు. మనకు సహాయం చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పకపోతే ఈ ఎమోషన్ ఎలా కంప్లీట్ అవుతుంది? అనిపించింది. అది నా మైండ్‌ లో అలాగే ఉండిపోయింది. ఒక ఆడియన్ గా అప్పుడు నా ఎమోషన్ సంతృప్తి చెందలేదు. అందుకే 'మగధీర' లో ఇసుక ఊబిలో కూరుపోయిన చరణ్‌ బయటకు వచ్చిన తర్వాత తన గుర్రాన్ని కౌగలించుకుంటాడు. ఒక స్నేహితుడిలా చూస్తూ దానితో కృతజ్ఞత భావంతో మాట్లాడతాడు. అలా నా సినిమాల్లో బలమైన సన్నివేశాలు ప్రేక్షకుల ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది రాసినవే ఉంటాయి'' అని చెప్పుకొచ్చారు.