Begin typing your search above and press return to search.

‘అహ నా పెళ్ళంట’ తో ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ - శివానీ రాజశేఖర్..!

By:  Tupaki Desk   |   5 April 2022 2:30 AM GMT
‘అహ నా పెళ్ళంట’ తో ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ - శివానీ రాజశేఖర్..!
X
తెలుగులోనూ వెబ్ సిరీస్ ల సందడి కొనసాగుతుండటంతో పాపులర్ స్టార్స్ సైతం ఓటీటీ స్క్రీన్ లపై కనిపించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వెబ్ ఓటీటీ కంటెంట్ లో ప్రయోగాలు చేయడానికి ఎలాంటి అవధులు లేకపోవడం.. విలక్షణమైన పాత్రల్లో నటించే ఛాన్స్ వస్తుండంతో అందరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

అలానే సినిమాల్లో అవకాశాలు తగ్గిన వారికి కూడా ఓటీటీలు సెకండ్ ఆప్షన్ గా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో అనేక మంది టాలీవుడ్ నటీనటులు వెబ్ సిరీస్ లలో నటించారు. ఈ క్రమంలో తాజాగా రాజ్ తరుణ్ - శివాని రాజశేఖర్ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ZEE5 రూపొందించే "అహ నా పెళ్ళంట'' అనే ఒరిజినల్ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ - శివాని రాజశేఖర్ భాగం అవుతున్నారు. ఆదివారం ఈ వెబ్ సిరీస్ ను రాజమండ్రిలోని గరిమొళ్ల సత్యనారాయణ ట్రైనింగ్ కాలేజ్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన నటీనటులతో పాటుగా ఎంపీ మార్గాని భరత్ - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ - చందన నాగేశ్వరావ్ - కందుల దుర్గేష్ - ఆదిరెడ్డి వాసు - గాదంశెట్టి శ్రీధర్ మరియు జీ5 నుంచి పూర్ణ ప్రజ్ఞ - రాధ కృష్ణవేణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఎన్నో ఏళ్లుగా పెళ్ళి కోసం ఎదురు చూసి ఓ యువకుడు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన తర్వాత.. తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడంతో వారిద్దరిపై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథంతో కామెడీ రొమాన్స్ ఎంటర్టైనర్ గా "అహ నా పెళ్ళంట'' తెరకెక్కుతోంది.

ఇందులో రాజ్ తరుణ్ - శివాని రాజశేఖర్ జంటగా నటిస్తుండగా.. ఆమని - హర్షవర్ధన్ - పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. నగేష్ బన్నెల సినిమాటోగ్రఫి అందిస్తుండగా.. జాదుహ్ శాండి సంగీతం సమకూరుస్తున్నారు. కథ - స్క్రీన్ ప్లే దావూద్ అందించగా.. కళ్యాణ్ రాఘవ మాటలు రాస్తున్నారు.

‘ఏబీసీడీ’ ఫేమ్ సంజీవ్ రెడ్డి ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ తమాడ - సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘అహ నా పెళ్ళంట’ పూజా కార్యక్రమాల అనంతరం ZEE5 మరియు తమడ మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

''రాజ్ తరుణ్ తొలిసారిగా వెబ్ కంటెంట్ లో నటించడం వెబ్ సిరీస్ లకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం. ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లోని హీరోలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. మొన్న నటుడు సుశాంత్ మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో నటించడానికి ముందుకు రాగా.. ఇప్పుడు రాజ్ తరుణ్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది'' అని పేర్కొన్నారు.

''ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సరికొత్త ప్రేమ కథ ఇది. అందరినీ అలరించేలా ఉంటుంది. కామెడీ డ్రామా - రొమాన్స్ తో సాగే ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్.. 30 నిముషాల నిడివితో 8 ఎపిసోడ్స్ గా ప్రసారం అవుతుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది'' అని మేకర్స్ తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ''పెళ్లి రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్లి కూతురు లేచిపోతుంది. చేతిలో మంగళ సూత్రం పట్టుకుని ఆమె కోసం మండపంలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి.. తన జీవితంలో ముఖ్యమైన రోజున అలా జరుగుతుందని ఊహించలేదు.

అందుకు కారణమైన అమ్మాయి - అబ్బాయి పై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ లో చూడాలి. జీ5 వంటి పెద్ద సంస్థలో పని చేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు'' అని అన్నారు.