Begin typing your search above and press return to search.

మాటల్లేని వర్మ సినిమా

By:  Tupaki Desk   |   25 Oct 2015 6:39 AM GMT
మాటల్లేని వర్మ సినిమా
X
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చారు. తనకు సంబంధం ఉన్నా లేకున్నా.. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం మీదా మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. తన మాటలతో కొత్త కొత్త వివాదాల్ని సృష్టించే అరుదైన తీరు వర్మ సొంతం.

ట్విట్టర్ పిట్టతో ఎన్ని గొడవలు తేవచ్చో వర్మకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. సినిమాల పరంగా తనకంటూ ఒక ముద్రను వేసిన ఆయన తాజాగా ఒక ప్రయోగత్మక సినిమా ప్రాజెక్టు టేకప్ చేశారన్నది ఇండస్ట్రీ టాక్.

హర్రర్.. మాఫియా.. ఫ్యాక్షన్ లాంటి సినిమాలను అలవోకగా తీసేసే ఆయన చిత్రాల్లో హిట్ల కంటే ఫట్ అన్నవే ఎక్కువ. గతంలో మాటలు తక్కువగా చెప్పి సినిమా ద్వారా తన సత్తా చాటే వర్మ.. కొద్దికాలంగా సినిమాల్లో విషయం తక్కువ.. బయట చెప్పే మాటలు ఎక్కువన్న విమర్శలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన చేపట్టిన ప్రాజెక్టు మూకీ సినిమా అని చెబుతున్నారు. మాటల్లేని సినిమా ప్రయోగం కొత్తది కాకున్నా.. చాలా తక్కువ మంది మాత్రమే ఈ అటెంప్ట్ చేశారు. గతంలో సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో కమలహాసన్ పుష్పక విమానం అన్న సినిమాను తీశారు.

ఈ సినిమా మొత్తంలో ఒక్క డైలాగ్ ఉండదు. ఇదే తరహాలో.. తన తాజా సినిమాను మూకీగా తీసేందుకు సన్నాహాలు స్టార్ట్ చేశారని చెబుతున్నారు. ఈ సినిమా హీరోగా ఉయ్యాల జంపాల.. సినిమా చూపిస్తా మామా లాంటి హిట్ సినిమాల్లో నటించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధానపాత్ర పోషిస్తారంటున్నారు. తన మాటలతో రచ్చ రచ్చ చేసే వర్మ లాంటి వ్యక్తి అసలు మాటల్లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందో? ఈ ఒక్క ఆసక్తి చాలదూ..వర్మ మూకీ సినిమా కాస్తా.. క్రేజీ ప్రాజెక్ట్ గా మారటానికి.