Begin typing your search above and press return to search.

ఇది కొడితే ఆయనే గ్రేటెస్ట్

By:  Tupaki Desk   |   3 May 2018 1:30 AM GMT
ఇది కొడితే ఆయనే గ్రేటెస్ట్
X
బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని ఇప్పటిదాకా తీసింది నాలుగే సినిమాలు. కానీ ఆయన ఇమేజ్ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’.. ‘మున్నాభాయ్ జిందాబాద్’.. ‘3 ఇడియట్స్’.. ‘పీకే’.. ఇలా ఏ సినిమాకు ఆ సినిమా ఒక ఆణిముత్యమే. ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిత్రాలివి. ఈ సినిమాలతో ఇప్పటికే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటస్ట్ ఎవర్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు హిరాని. తన ప్రతి సినిమాతోనూ చాలా మంచి విషయాలు చెబుతూ.. ఆ సినిమాల్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాల్లాగా తీర్చిదిద్దాడు హిరాని. అలాగని అవేమీ సందేశాత్మక చిత్రాల్లా ఉండవు. చాలా వినోదాత్మకంగా సాగుతాయి. అందుకే హిరానికి అంత గొప్ప పేరు వచ్చింది. అలాంటి దర్శకుడు సంజయ్ దత్ జీవిత కథతో ‘సంజు’ సినిమా తీయాలని అనుకున్నపుడు అందరూ సందేహంగా చూశారు.

ఇప్పటిదాకా అన్నీ ‘మంచి’ సినిమాలే తీసిన హిరాని.. ఇలాంటి ‘చెడ్డ’ సినిమా ఎందుకు ఎంచుకున్నాడని అన్నారు. సంజయ్ దత్ జీవితంలో ఎన్నో చీకటి కోణాలున్నాయి. అతనో డ్రగ్ ఎడిక్ట్. మారణాయుధాల కేసులో జైలుకు కూడా వెళ్లాడు. ఇంకా ఎన్నో నెగెటివ్ కోణాలున్నాయి అతడి జీవితంలో. తన మిత్రుడైన సంజయ్ జీవితాన్ని హిరాని పాజిటివ్ గా మార్చి చూపిస్తాడేమో.. దీని వల్ల ఆయన ఇమేజ్ దెబ్బ తింటుందేమో.. ప్రతి సినిమాతోనూ ఒక మంచి సందేశాన్నిచ్చే ఆనవాయితీని ఈ చిత్రంతో విడిచిపెడతాడేమో అన్న అనుమానాలు కలిగాయి. ఈసారి హిరాని తన గొప్పదనాన్ని.. ప్రత్యేకతను చాటుకోలేడేమో అనిపించింది. కానీ ‘సంజు’ టీజర్ చూశాక ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఈ చిత్రాన్ని కూడా హిరాని తనదైన శైలిలోనే చాలా ఆసక్తికరంగా.. ఎమోషనల్ గా కదిలించేలా తెరకెక్కించాడని అర్థమవుతోంది. అన్నింటికీ మించి సంజయ్ జీవితాన్న ఉన్నదున్నట్లుగానే.. నిజాయితీగానే తీసే ప్రయత్నం చేసినట్లున్నాడు. ఇలాంటి సినిమాలోనూ తన ముద్ర ఆయన కొనసాగించినట్లే ఉంది. సంజయ్ కథను ఆసక్తికరంగా చూపిస్తూనే సమాజానికి ఏదో ఒక సందేశం ఇచ్చేలాగే కనిపిస్తున్నాడు హిరాని. ఈ చిత్రంలోనూ తన ముద్ర చూపించి.. గత సినిమాల్లాగే భారీ విజయాన్ని అందుకోగలిగాడంటే మాత్రం హిరాని ఇండియన్ ఫిలిం హిస్టరీలో గ్రేటెస్ట్ ఎవర్ దర్శకుడనిపించుకుంటాడనడంలో సందేహం లేదు.