Begin typing your search above and press return to search.

దత్ జైల్లో ఉండి కూడా కోట్లు సంపాదిస్తున్నాడు

By:  Tupaki Desk   |   4 Dec 2015 8:16 PM GMT
దత్ జైల్లో ఉండి కూడా కోట్లు సంపాదిస్తున్నాడు
X
సంజయ్ దత్ జైల్లో ఉండి కూడా కోట్లు సంపాదిస్తున్నాడు. అలాగని జైలు నుంచి అతడేమైనా దందాలు చేస్తున్నాడేమో అనుకునేరు. అలాంటిదేమీ కాదు. తన జీవిత కథతో సినిమా తీయడానికి అంగీకరించినందుకు అతను భారీ మొత్తంలో డబ్బులు అందుకుంటున్నాడు. ఆ మొత్తం అక్షరాలా రూ.5 కోట్లు కావడం విశేషం. బాలీవుడ్ టాప్ డైరెక్టర్, సంజయ్ దత్ క్లోజ్ ఫ్రెండ్ రాజ్ కుమార్ హిరాని.. సంజూ జీవిత కథతో ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తీయడానికి అంగీకరించినందుకు సంజయ్ కి రూ.5 కోట్లు పారితోషకంగా ఇచ్చాడట హిరాని.

‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’ వంటి బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగిన హిరాని.. సంజూ జీవిత కథతో సినిమా తీయాలనుకోవడం చిత్రమైన విషయమే. తన ప్రతి సినిమాతోనూ ఎన్నో మంచి విషయాలు చెప్పిన హిరాని.. జైలు శిక్ష అనుభవించిన ఓ నేరస్థుడి కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటాడన్నది ఆసక్తికరం. తన మిత్రుడిని ఏమీ తెలియని అమాయకుడిగా చూపిస్తాడా? ఉన్నదున్నట్లు చూపిస్తాడా? అని బాలీవుడ్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించబోతున్నాడు.

వచ్చే ఏడాదే శిక్ష పూర్తి చేసుకుని బయటికి రానున్న సంజు కూడా ఓ క్యామియో రోల్ చేస్తాడట. తన కథతో సినిమా తీస్తున్నందుకు రూ.5 కోట్లు తీసుకోవడంతో పాటు తనతో దీని తర్వాత మున్నాభాయ్-3 తీయాలని కూడా సంజు హిరానికి కండిషన్ పెట్టినట్లు సమాచారం.