Begin typing your search above and press return to search.

సినిమా మొత్తానికి ఆ ఒక్క డైలాగ్ చాలు!

By:  Tupaki Desk   |   9 Dec 2021 6:31 AM GMT
సినిమా మొత్తానికి ఆ ఒక్క డైలాగ్ చాలు!
X
టాలీవుడ్ లో ఉన్న లేడీ డైరెక్టర్లను వ్రేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి లేడీ డైరెక్టర్ల జాబితాలో కొత్తగా మరొకరు చేరిపోయారు. ఆమె పేరే సుజనారావు .. 'గమనం' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. శ్రియ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

శివ కందుకూరి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఆయన నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు. అభిరుచి కలిగిన నిర్మాతగా ఆయనకి మంచి పేరు ఉంది. ఈ వేదికపై రాజ్ కందుకూరి ఈ సినిమాను గురించి మాట్లాడారు.

"ఒక రెండు నెలల క్రితం ఈ సినిమాను నాకు సుజనారావుగారు చూపించారు. నేను ఈ సినిమా షూటింగు జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు లొకేషన్ కి వెళ్లి ఒక కాఫీ తాగేసి వచ్చేసేవాడిని.

అక్కడ ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. కానీ మంచి ప్రోడక్ట్ ఒకటి రెడీ అవుతోందని మాత్రం అనిపించేది. ఎందుకంటే కేన్వాస్ మీద చూస్తే .. ఇళయరాజాగారి మ్యూజిక్ .. సాయిమాధవ్ బుర్రాగారి డైలాగ్స్ ..జ్ఞానశేఖర్ గారి కెమెరా వర్క్ .. శ్రియ లీడ్ రోల్. ఎలా చూసినా ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది.

ఈ సినిమాకి పనిచేస్తున్నవాళ్లంతా అంత ఈజీగా సుజనారావు అనే ఒక అమ్మాయిని ఎంకరేజ్ చేయరే అనిపించింది. ఆమెలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని అనుకున్నాను. నాకు తెలిసి ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ లో ఇలాంటి ఒక సినిమా చేయాలి. అంటే దాంట్లో ఫైట్స్ ఉండవు .. డ్యూయెట్లు ఉండవు .. కమర్షియల్ మాస్ మసాలా ఉండదు.

మీరు థియేటర్ నుంచి ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఈ సినిమాలోని సన్నివేశాలు వెంటాడుతూ ఉంటాయి .. అలాంటి సినిమా ఇది. ఈ సినిమాలో శ్రియ డైలాగ్ ఒకటి ఉంది. "నాకు వినిపించకపోయినా రోజు గంటకొట్టి నీకు పూజ చేస్తాను .. కానీ నీకు కూడా వినిపించదని నాకేం తెలుసు" అని. సినిమా మొత్తానికి ఈ ఒక్క డైలాగ్ చాలు.

ఇలాంటివి ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి .. మీరు థియేటర్లో చూడండి. థియేటర్లో నుంచి బయటికి వచ్చిన తరువాత చాలా మంచి సినిమాను చూశామని అనుకుంటారు. సుజనారావు ఒక మంచి సినిమాతో .. సరైన సమయంలో దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ సినిమా తప్పకుండా ఆమెకి హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ఇంత మంచి సినిమాలో మా అబ్బాయి శివ ఒక భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.