Begin typing your search above and press return to search.

'పెళ్ళిచూపులు’ దర్శక నిర్మాతల కన్నీటి గాథలు

By:  Tupaki Desk   |   28 Nov 2017 7:27 AM GMT
పెళ్ళిచూపులు’ దర్శక నిర్మాతల కన్నీటి గాథలు
X
‘పెళ్ళిచూపులు’ సినిమాతో గొప్ప పేరు సంపాదించాడు నిర్మాత రాజ్ కందుకూరి. ఈ చిత్రానికి ఆయన నంది అవార్డుతో పాటు జాతీయ పురస్కారం సైతం అందుకున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు రెండూ దక్కాయి ఆయనకు. అయితే ఈ సినిమా తీసేముందు.. తీసిన తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

తరుణ్ భాస్కర్ వచ్చి తనకు ‘పెళ్ళిచూపులు’ కథ చెప్పాడని.. ఇంటర్వెల్ వరకు చెప్పగానే అతను ఆగి.. తాను ఇప్పటికే ఈ కథను చాలామందికి చెప్పానని.. ఒకరిద్దరి దగ్గర స్క్రిప్టులు కూడా ఉన్నాయని.. నేను మీ వద్దకే ముందుగా వచ్చి కథ చెబుతున్నాను అనుకుని ఒప్పుకోకండి అన్నాడని.. ఐతే తనకు కథ నచ్చితే సినిమా చేస్తా తప్ప ఎవరైనా రిజెక్ట్ చేసి ఉన్నా తనకు అభ్యంతరం లేదని చెప్పానని.. కథ మొత్తం విన్నాక అతడిని కౌగిలించుకుని ఓకే చెప్పానని రాజ్ తెలిపాడు.

‘పెళ్ళిచూపులు’ సినిమా అయ్యాక ఒక డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్తే ఈ సినిమా టైటిల్ విని పెదవి విరిచాడని. ఇదేం టైటిల్.. 30 ఏళ్ల ముందు సినిమాలా అనిపిస్తోందని.. టైటిల్ వింటేనే సినిమా నడవదనిపిస్తోందని అతను అనడంతో తరుణ్ భాస్కర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయని రాజ్ వెల్లడించాడు. ఐతే తన మిత్రుడు మధుర శ్రీధర్ కు ఈ సినిమా చూపించగా.. అతను షాకయ్యాడని.. అద్భుతమైన సినిమా తీశావని మెచ్చుకున్నాడని.. ఆపై సురేష్ బాబు సినిమా చూసి రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారని చెప్పాడు.

ఇక తన వ్యక్తిగత జీవితంలో కష్టాల గురించి చెబుతూ.. తన తండ్రి శివానంద మూర్తి కోరిక మేరకే సినీ రంగంలోకి వచ్చానని.. నిర్మాతగా - దర్శకుడిగా సినిమాలు తీసి ఆర్థికంగా చాలా నష్టపోయానని తెలిపాడు. పరిస్థితి బాగా లేక అమెరికాకు వెళ్లి తిరిగొచ్చానని.. వచ్చాక అప్పట్లో రూ.4.5 లక్షలు పెట్టి సాంత్రో కారు కొన్నానని.. కానీ నెల రోజులకే తనకు కూతురు పుట్టిందని.. అప్పుడు పాపను ఖరీదైన ఓ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్సకు డబ్బుల్లేక తాను కొన్న కొత్త కారుని రూ.3.5 లక్షలకు అమ్మేశానని.. తన జీవితంలో కంటతడిపెట్టిన ఏకైక సంఘటన అదే అని రాజ్ తెలిపాడు.