Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'రైల్’

By:  Tupaki Desk   |   23 Sep 2016 6:22 AM GMT
మూవీ రివ్యూ : రైల్’
X
చిత్రం: ‘రైల్’

నటీనటులు: ధనుష్ - కీర్తి సురేష్ - హరీష్ ఉత్తమన్ - తంబి రామయ్య - కరుణాకరన్ - రాధారవి - గణేష్ వెంకట్రామన్ తదితరులు
సంగీతం: డి.ఇమాన్
ఛాయాగ్రహణం: వెట్రివేల్ మహేంద్రన్
నిర్మాతలు: ఆదిరెడ్డి - ఆదిత్య రెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రభు సాల్మన్

తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న తమిళ హీరో ధనుష్.. గత ఏడాది ‘రఘువరన్ బీటెక్’తో తొలిసారి మన ప్రేక్షకుల్ని మెప్పించాడు. అప్పట్నుంచి అతడి పాత.. కొత్త సినిమాలన్నీ తెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఐతే తొలిసారి అతడి సినిమా ఒకేసారి తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. అదే.. రైల్. ప్రేమఖైదీ.. గజరాజు..తొలి ప్రేమలో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమున్న ప్రభు సాల్మన్ రూపొందించిన సినిమా ఇది. కీర్తి సురేష్ కూడా ఉండటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులకూ ఆసక్తి పుట్టింది. ఈ ‘రైల్’ జర్నీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

శివాజీ (ధనుష్) ఓ అనాథ. అతను రైల్లో ప్యాంట్రీ వర్కర్ గా పని చేస్తుంటాడు. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే రైల్లో అతను విధుల్లో ఉండగా.. ఓ సినిమా హీరోయిన్ దగ్గర టచప్ గా పని చేస్తూ ఆమె వెంట ఆ రైల్లోనే ప్రయాణిస్తున్న సరోజ (కీర్తి సురేష్)ను శివాజీ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె తన ఊరిలో దిగిపోయే లోపు ఆమెను ప్రేమలో పడేయాలని చూస్తాడు శివాజీ. ఐతే ఈ ప్రయాణంలో అనేక అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఓవైపు దొంగలముఠా ప్రయాణికుల మీద దాడి చేస్తే.. మరోవైపు డ్రైవర్ చనిపోవడంతో ట్రైన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. మరోవైపు శివాజీ-సరోజ తీవ్రవాదులు అన్న ముద్ర పుడుతుంది. మరి ఈ పరిస్థితుల నుంచి శివాజీ-సరోజ ఎలా బయటపడ్డారు.. రైల్లోని ప్రయాణికుల పరిస్థితేంటి.. చివరికి శివాజీ-సరోజ ఒక్కటయ్యారా లేదా.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ప్రభు సాల్మన్ అంటే స్వచ్ఛమైన.. మంచి ఫీల్ ఉన్న ప్రేమకథలకు పెట్టింది పేరు. ఐతే ధనుష్ లాంటి స్టార్ దొరికేసరికి ఒక్క ప్రేమకథ మాత్రమే చూపిస్తే సరిపోదనుకున్నట్లున్నాడు. అందుకే కామెడీ.. సస్పెన్స్.. థ్రిల్.. యాక్షన్.. ఇలా చాలా రసాలు కలపాలని చూశాడు. ఈ క్రమంలో ‘రైల్’ ఎటూ కాకుండా పోయింది. ఏ రసమూ సరిగా పండక రెండున్నర గంటల జర్నీ.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా సాగింది.

హాలీవుడ్ మూవీ ‘అన్ స్టాపబుల్’ ఆధారంగా కథ అల్లుకున్న ప్రభు సాల్మన్ రెండున్నర గంటల కథను రైలు ప్రయాణంలోనే నడిపించబోయి పెద్ద సాహసమే చేశాడు. ఐతే హాలీవుడ్ మూవీలా దీన్ని కేవలం థ్రిల్లర్ లాగా నడిపినా పోయేది. కానీ అందులో పైన చెప్పుకున్న అనేక అంశాల్ని మిళితం చేయబోయి కథను కంగాళీగా తయారు చేశాడు. అసలు లాజిక్ అన్నదే లేకుండా సాగే ఈ జర్నీ.. చివరిదాకా భరించడం కష్టమే.

ఏడెనిమిది వందల మంది ప్రయాణం చేస్తున్న రైలు.. ఔట్ ఆఫ్ కంట్రోల్ అనగానే మనకు గుండెలు గుబేల్మంటాయి. కానీ ఆ రైల్లో ప్రయాణం చేస్తున్న ఎవరిలోనూ భయమే కనిపించదు. పోనీ వాళ్లకు తాము ప్రమాదంలో ఉన్న సంగతి తెలియదా అంటే అలా ఏం కాదు. ఇంటర్నెట్ ద్వారా టీవీల్లో తమ పరిస్థితిపై జరుగుతున్న లైవ్ షోలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే తమను కాపాడ్డానికి హీరో అష్టకష్టాలు పడుతుంటే దాన్ని కూడా లైవ్లో చూసి చప్పట్లు కొడుతుంటారు.

కేంద్ర మంత్రి సహా ఎవరిలోనూ అసలు కంగారే కనిపించకపోవడం.. రైల్లోని పాత్రలన్నీ కామెడీ చేస్తుండటం.. దర్శకుడు కూడా ఆ సమయంలో కామెడీ రాబట్టడానికి ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రథమార్ధానికే రైలు ఔట్ ఆఫ్ కంట్రోల్ అయితే.. ద్వితీయార్దమంతా ఈ అర్థం లేని వ్యవహారాలతోనే నడిచిపోతుంది. మొదట్లో రైలు పరిస్థితి చూసి కంగారు పడ్డ ప్రేక్షకుడు.. ఆ తర్వాత తెరమీద నడిచే సిల్లీ వ్యవహారమంతా చూసి.. లైట్ తీసుకుంటాడు. పూర్తిగా సినిమాతో డిస్కనెక్ట్ అయిపోయి జరిగే తమాషా చూడ్డం తప్ప చేసేదేమి ఉండదు.

ప్రభు సాల్మన్ అంటే ఏది ఎలా ఉన్నా ప్రేమకథ మాత్రం గొప్పగా ఉంటుంది. చాలా సిన్సియర్ గా లవ్ స్టోరీలు తీస్తాడతను. అందులో మంచి ఫీల్ ఉంటుంది ఆ ప్రేమకథల్లో. కానీ ‘రైల్’ మాత్రం అందుకు మినహాయింపు. హీరోయిన్ సింగర్ కావాలనుకుంటుంది. కానీ ఆమె వాయిస్ ఘోరంగా ఉంటుంది. హీరో తాను పెద్ద లిరిసిస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుని ఆమెను అట్రాక్ట్ చేస్తాడు. ఇదీ వాళ్లిద్దరి మధ్య ప్రేమకథ సాగే వైనం. హీరో ఆమె కోసం ప్రాణాలే లెక్క చేయనంత ‘ప్రేమ’ చూపిస్తాడు చివర్లో. కానీ అతను అంత త్యాగం చేయడానికి తగ్గట్లుగా ముందు లవ్ స్టోరీని బిల్డ్ చేయలేదు. ఈ సినిమాలో కథతో కనెక్ట్ కాకపోయినా.. కొంత వరకు కామెడీనే వర్కవుట్ అయింది.

హరీష్ ఉత్తమన్ విలనీ వేస్ట్ అయిపోయింది. కథతో దాన్ని ఏమాత్రం కనెక్ట్ చేయలేకపోయారు. రైల్లో ఉన్న ఎన్ఎస్ఎఫ్ కమాండోలు అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ చేసే తీరు చూస్తే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థమైపోతుంది. ప్రథమార్ధంలో వినోదం సినిమాను కొంత వరకు ముందుకు నడిపించినా.. సిల్లీ సెకండాఫ్ సినిమా గ్రాఫ్ ను పూర్తిగా కిందికి తీసుకెళ్లిపోయింది. చివర్లో సినిమాను ముగించిన తీరు చూస్తే.. తమిళ సినిమా చాలా అడ్వాన్స్ అన్న అభిప్రాయాల్ని మార్చుకోవాలనిపిస్తుంది. మొత్తంగా ధనుష్ మీద.. ప్రభు సాల్మన్ మీద ఆశలు.. అంచనాలు పెట్టుకుని చూస్తే ‘రైల్’ తీవ్రంగా నిరాశ పరచడం ఖాయం.

నటీనటులు:

ధనుష్ స్టార్ హీరో అయినా ప్యాంట్రీ వర్కర్ పాత్రకు ఒప్పుకున్నాడంటే అతడి కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైగా సినిమాలో అతను హీరోలాగా కనిపించడు. అతడిది కథలో ఓ పాత్ర.. అంతే. అతడి నటన గురించి చెప్పేదేముంది.. సునాయాసంగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. కాకపోతే అతను ఇలాంటి కథకు ఎలా ఓకే చెప్పాడన్నదే సందేహం. ధనుష్ కంటే కూడా కీర్తి సురేష్ బాగా ఆకట్టుకుంటుంది. ఆమె నటనలోని మరో కోణం ఈ సినిమాలో చూడొచ్చు. కళ్లతో మ్యాజిక్ చేస్తుంది కీర్తి. నటన సహజంగా ఉంది. హావభావాలు బాగున్నాయి. కానీ ఆమె పాత్రే బాలేదు. హరీష్ ఉత్తమన్ ఓవరాక్షన్ చేశాడు. తంబి రామయ్య.. కరుణాకరన్ కొంతవరకు నవ్వించారు. కానీ వారి కామెడీలో తమిళ నేటివిటీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

ప్రభు సాల్మన్ ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటికీ తన సంగీతంతో ప్రాణం పోశాడు డి.ఇమాన్. కానీ ఈ సినిమాకు అతడి సంగీతం అంతగా ఆకర్షణ కాలేకపోయింది. థ్రిల్లర్ టచ్ ఉండటంతో లవ్ సాంగ్స్ కు పెద్దగా అవకాశం లేకపోయింది. హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే తొలి పాట ఒకటి శ్రావ్యంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. వెట్రివేల్ మహేంద్రన్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు చూస్తే మాత్రం ఇది ధనుష్ లాంటి స్టార్ నటించిన సినిమానేనా అనిపిస్తాయి. సీజీ వర్క్.. ఎఫెక్ట్స్ చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. దర్శకుడు ప్రభు సాల్మన్.. లవ్ స్టోరీని తీర్చదిద్దడంలో తన బలాన్ని చూపించలేకపోయాడు. థ్రిల్లర్ అంశాల్నీ సరిగా డీల్ చేయలేకపోయాడు. సీరియస్ గా నడపాల్సిన కథను సిల్లీగా నరేట్ చేసి సినిమాను తేల్చేశాడు.

చివరగా: ఈ ‘రైల్’ జర్నీ కష్టం బాబోయ్

రేటింగ్: 2/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre