Begin typing your search above and press return to search.

అంత తిరుగుతున్నా ఇద్దరి మద్య ఏమీ లేదట!

By:  Tupaki Desk   |   23 Jun 2020 1:30 PM IST
అంత తిరుగుతున్నా ఇద్దరి మద్య ఏమీ లేదట!
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 కంటెస్టెంట్స్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌ మరియు పునర్నవి భూపాలంలు ప్రేమలో ఉన్నట్లుగా అప్పటి నుండి ప్రచారం జరుగుతుంది. షో జరుగుతున్న సమయంలోనే ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. రాహుల్‌ వెళ్లి పోయిన సమయంలో పునర్నవి ఎమోషన్‌ మళ్లీ వచ్చిన సమయంలో ఆమె ఆనందం అంతా చూస్తే ఇద్దరు రిలేషన్‌ లో ఉన్నట్లుగానే అనిపించింది. కాని పునర్నవి బయటకు వచ్చిన తర్వాత మా మద్య అలాంటి వ్యవహారం ఏమీ లేదని మేము ఇద్దరం స్నేహితులం మాత్రమే అంది.

రాహుల్‌ విజేతగా బయటకు వచ్చిన తర్వాత భారీ ఎత్తున కార్యక్రమాలు జరిగాయి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ సమయంలో పునర్నవి కూడా ఉంది. ఇద్దరు కలిసి పార్టీలకు పబ్‌ లకు తిరిగారు. ఇద్దరు కూడా బయట పార్టీల్లో చాలా క్లోజ్‌ గా ఉంటున్నారు. వారిని చూసిన ఎవరైనా కూడా ప్రేమలో ఉన్నారనే అనుకుంటారు. ఇప్పటికే పలు సార్లు రాహుల్‌ తో తనది కేవలం స్నేహం మాత్రమే అంటూ చెప్పిన పున్ను మరోసారి అదే మాట చెప్పింది.

ఇటీవల రాహుల్‌ మరియు పునర్నవిలు ఒక పార్టీలో కలిశారు. ఆ సందర్బంగా వారిద్దరు చాలా క్లోజ్‌ గా ఉండటంతో పాటు ప్రైవేట్‌ గా మాట్లాడుకోవడం చేశారంటూ గుసగుసలు వినిపించాయి. దాంతో మళ్లీ ఇద్దరి ప్రేమ వ్యవహారం చర్చ జరిగింది. తాజా వార్తలపై మళ్లీ పునర్నవి స్పందించింది. గతంలో చెప్పినట్లుగానే మళ్లీ ఇప్పుడు కూడా ఆ వార్తలను కొట్టి పారేస్తూ తామిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పునర్నవి ఏదో ఒక సమయంలో తమ ప్రేమ విషయం చెబుతుందంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. కాని పున్ను మాత్రం రాహుల్‌ తో స్నేహం తప్ప అంతకు మించి ఏమీ లేదని చెబుతూనే వస్తోంది.