Begin typing your search above and press return to search.

విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించిన సంగీత దిగ్గ‌జం!

By:  Tupaki Desk   |   8 Feb 2019 8:07 AM GMT
విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించిన సంగీత దిగ్గ‌జం!
X
ఎ.ఆర్‌.రెహ‌మాన్‌.. ఎప్పుడూ సంగీత ప్ర‌పంచంలో మునిగి తేలుతుంటాడు. ఎన్నెన్నో సినిమాల‌కు ఆయ‌న త‌న‌దైన బాణీల‌ను అందించాడు. ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించాడు. పాట‌ల ప్ర‌పంచంలో మైమ‌రిచిపోయేలా చేశాడు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆస్కార్ అవార్డు సాధించ‌డం ద్వారా భార‌త ఖ్యాతిని ప్ర‌పంచ య‌వ‌నిక‌పై ఘ‌నంగా చాటిచెప్పాడు. వివాదాల‌కు ఆయ‌న చాలా దూరం. నోరెత్తి ఎవ‌ర్నీ ఒక్క మాట కూడా అన‌డు.

అలాంటి రెహ‌మాన్ తాజాగా అనుకోకుండా ఓ విష‌యంలో విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. సంకుచిత స్వ‌భావి అంటూ నింద‌లు ప‌డ్డాడు. అయితే - వెంట‌నే తేరుకున్న రెహ‌మాన్‌.. ఆ విష‌యంలో త‌న‌ను విమ‌ర్శించిన‌వారికి గ‌ట్టిగా బుద్ది చెప్పాడు. తాను సంకుచిత స్వ‌భావిని కాద‌ని చాటుకుంటూ విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించాడు.

అస‌లేం జ‌రిగిందంటే.. రెహమాన్ ఆస్కార్ గెలిచిన చిత్రం స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో తాజాగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెహమాన్ తోపాటు ఆయ‌న కుమార్తె ఖతీజా కూడా హాజరైంది. వేదిక‌పై ప్ర‌సంగించింది కూడా. ఆమె ప్రసంగానికి చాలా మంచి స్పందన వచ్చింది.

అయితే - ఖ‌తీజా బుర్ఖా ధ‌రించి కార్య‌క్ర‌మానికి రావడంతో విమ‌ర్శ‌కులు త‌మ నోళ్ల‌కు ప‌నిచెప్పారు. రెహ‌మాన్ ఒత్తిడి వ‌ల్లే ఆమె బుర్ఖాతో వ‌చ్చింద‌ని ఆరోపించారు. ఆయ‌న్ను సంకుచిత స్వ‌భావిగా నిందించారు. సంగీత దిగ్గజం అస‌లు సిస‌లు మ‌న‌స్త‌త్వం ఏంటో తెలిసిపోయిందంటూ విమ‌ర్శించారు.

రెహ‌మాన్ పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌టంతో ఖ‌తీజా ఆగ్ర‌హించింది. తాను బుర్ఖా ధ‌రించ‌డంలో తండ్రి ఒత్తిడి ఏమాత్రం లేదంటూ సోష‌ల్ మీడియాలో వివ‌ర‌ణ ఇచ్చింది. ఇష్ట‌పూర్వ‌కంగా తానే బుర్ఖా ధ‌రించి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది. త‌న త‌ల్లిదండ్రులు - కుటుంబ స‌భ్యులు త‌న వ్యక్తిగత స్వేచ్చని గౌర‌విస్తార‌ని తెలిపింది. ఇక‌నైనా విమ‌ర్శ‌లు మానుకోవాల‌ని సూచించింది.

ఆపై రెహ‌మాన్ కూడా త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై స్పందించాడు. తన రెండో కుమార్తె రహీమా - సతీమణి సైరా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ముకేశ్ అంబానీ స‌తీమ‌ణి నీతా అంబానీతో క‌లిసి బుర్ఖా లేకుండా దిగిన ఫొటోను ట్విట‌ర్ లో ఆయ‌న పోస్ట్ చేశాడు. తన కుటుంబం వ్యక్తిగత స్వేచ్చకు ఎలాంటి విలువ‌ ఇస్తుందో తెలుపుతూ ఫ్రీడమ్ టూ చూజ్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. దీంతో మొత్తానికి తండ్రీ కూతుళ్లు క‌లిసి విమ‌ర్శ‌కుల‌కు బాగా బుద్ధి చెప్పార‌ని ప‌లువురు చెప్పుకుంటున్నారు.