Begin typing your search above and press return to search.

చిరంజీవి పిలిచి 20 వేలిచ్చాడు

By:  Tupaki Desk   |   31 July 2016 11:30 AM GMT
చిరంజీవి పిలిచి 20 వేలిచ్చాడు
X
యాంకర్‌ గా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత గాయకుడిగా మారి.. ఆపై సంగీత దర్శకుడిగానూ సత్తా చాటుకున్నాడు రఘు కుంచె. దాదాపు దశాబ్దం పాటు బుల్లి తెర మీద టాప్ యాంకర్లలో ఒకడిగా వెలుగొంది.. నంది అవార్డు కూడా అందుకున్న రఘు.. ఉన్నట్లుండి గాయకుడి అవతారమెత్తి ‘బాచి’ సినిమాలో లచ్చిమి లచ్చిమి అనే పాటతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా.. రఘు పాట మాత్రం సూపర్ పాపులరైంది. ఆ ఊపులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే పాట పాడే ఛాన్స్ దక్కించుకున్నాడు రఘు. ‘మృగరాజు’ సినిమాలో హంగామా హంగామా అంటూ అతను పాడిన పాట కూడా సూపర్ హిట్. ఐతే ఆ పాట తాను పాడుతానని ఎంత మాత్రం అనుకోలేదని.. తన పాటను చిరంజీవి వింటే చాలు అనుకుంటే ఆయన ఏకంగా పాట పాడే అవకాశం ఇచ్చాడని నాటి అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రఘు.

‘‘బుల్లితెర మీద అప్పట్లో నేనొక్కడినే పాపులర్ మేల్ యాంకర్. అందుకే అందరూ నన్ను గుర్తుపట్టేవాళ్లు. అలాగే చిరంజీవి గారితో కూడా పరిచయమైంది. బాచిలో పాట పాడాక.. అది మెగాస్టార్ వింటే బాగుంటుందని ఒకసారి ఆయన్ని కలిసి ‘బాచి’ ఆడియో సీడీ ఇచ్చాను. అరగంట తర్వాత ఆయనే ఫోన్ చేసి పాట చాలా బాగుందన్నారు. కొన్ని రోజుల తర్వాత ‘మృగరాజు’ షూటింగ్ జరుగుతున్న టైంలో చిరంజీవి గారే మణిశర్మ గారికి నా గురించి చెప్పి అందులో ఓ పాట నాతో పాడించమన్నారు. మణిగారు ఆడిషన్ చేసి హంగామా హంగామా అనే పాట పాడించారు. ఏదో నా గొంతు చిరంజీవి గారికి వినిపిద్దామని ఆయన్ని కలిస్తే ఏకంగా ఆయనకు పాట పాడే ఛాన్సిచ్చారు. ఆ షాక్ నుంచే తేరుకునే లోపే తన మేనేజర్ని పిలిచి రూ.20 వేలు పారితోషకంగా ఇప్పించారు. అప్పట్లో సాధారణ గాయకులకు రెండు వేలో మూడు వేలో ఇస్తే ఎక్కువ. అలాంటిది నాకు అంత మొత్తం ఇచ్చేసరికి చాలా ఆశ్చర్యమేసింది. ఆ పాట తాలూకు అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’’ అని రఘు చెప్పాడు.