Begin typing your search above and press return to search.

వావ్: దర్శకేంద్రుడి యాక్టింగ్ డెబ్యూ?

By:  Tupaki Desk   |   8 Feb 2016 11:00 PM IST
వావ్: దర్శకేంద్రుడి యాక్టింగ్ డెబ్యూ?
X
తెర వెనక ఉండే దర్శకులు తెర ముందుకు వస్తే ఆసక్తికరంగా ఉంటుంది. దాసరి నారాయణ రావు, కె.విశ్వనాథ్ లాంటి దిగ్గజాలు ఇలా కెమెరా ముందుకు వచ్చి అలరించారు. అలరిస్తూనే ఉన్నారు. ఐతే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రం ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఆయన మాట్లాడ్డమే తక్కువంటే ఇక నటించడం గురించి ఆలోచించడానికి అవకాశమే లేకపోయింది. ఐతే ఈ మధ్య దర్శకేంద్రుడిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మీడియాతో ఫ్రీగా మాట్లాడేస్తున్నారు. వేదికలెక్కి స్పీచులిస్తున్నారు. సౌందర్యలహరి పేరుతో తన సినీ అనుభవాల మీద ఓ కార్యక్రమమే పెట్టి నడిపించారు.

ఇప్పుడిక దర్శకేంద్రుడు నటనలోకి కూడా అడుగుపెట్టేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శతమానం భవతి పేరుతో రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘దొంగల బండి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకుడు. ఇందులో ఓ మంచి పాత్ర ఉందని.. దానికి దర్శకుడు రాఘవేంద్రరావు సూటవుతారని దర్శక నిర్మాతలు భావించారట. ఆయన్ని సంప్రదించడం కూడా జరిగిందట. ఐతే రాఘవేంద్రరావు ఏ విషయం తేల్చకుండా స్క్రిప్ట్ చదివి చెబుతా అన్నారట. ఐతే దర్శకేంద్రుడికి స్క్రిప్టు కచ్చితంగా నచ్చుతుందని.. ఆయన ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తారని ఆశతో ఉన్నారు రాజు, వేగేశ్న. మరి వాళ్ల అంచనా ఫలించి రాఘవేంద్రరావు యాక్టింగ్ డెబ్యూ చేస్తారేమో చూడాలి.