Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్స్‌ తలదించుకునేలా చేసిన డాన్స్‌ మాస్టర్‌

By:  Tupaki Desk   |   10 April 2020 7:30 AM GMT
సూపర్‌ స్టార్స్‌ తలదించుకునేలా చేసిన డాన్స్‌ మాస్టర్‌
X
కరోనా విపత్తు నేపథ్యంలో సినిమా స్టార్స్‌ పలువురు తమకు తోచినంత సాయంను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. లక్షలు.. కోట్లు ఎవరికి తోచినది వారు ఇస్తూ తమ మనసు చాటుకుంటున్నారు. ఈ సమయంలో దర్శకుడు రాఘవ లారెన్స్‌ మూడు కోట్ల విరాళంను ప్రకటించి సౌత్‌ సినీ స్టార్స్‌ అంతా కూడా తల దించుకునేలా చేశాడు. స్టార్స్‌.. సూపర్‌ స్టార్స్‌ కూడా కోటికి అటు ఇటుగానే సాయం చేశారు. కాని లారెన్స్‌ మాత్రం ఏకంగా మూడు కోట్ల విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే.

ఒక సామాన్య డాన్సర్‌ స్థాయి నుండి ప్రస్తుతం డైరెక్టర్‌ స్థాయికి ఎదిగిన లారెన్స్‌ ఇచ్చిన విరాళం నిజంగా అభినందనీయం. స్టార్‌ హీరోలు తీసుకునే పారితోషికంలో కనీసం పావుల వంతు కూడా పారితోషికంగా అందుకోని లారెన్స్‌ విరాళం విషయంలో మాత్రం సూపర్‌ స్టార్స్‌ కు మూడు నాలుగు రెట్ల అధిక స్థాయిలో ఇచ్చి అందరి కంటే తానే సూపర్‌ స్టార్‌ అంటూ నిరూపించుకున్నాడని లారెన్స్‌ అభిమానులు నెట్టింట ప్రచారం చేస్తున్నారు.

రజినీకాంత్‌.. విజయ్‌.. అజిత్‌ ఇంకా పలువురు స్టార్‌ హీరోలను తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని చూస్తారు. తమ అభిమాన హీరోలను ఎవరైనా ఒక్క మాట అంటే ఏం చేసేందుకు అయినా వెనుకాడరు. వెండి తెరపై హీరోలుగా అద్బుతాలు సృష్టించే సూపర్‌ స్టార్‌ హీరోలు నిజ జీవితంలో మాత్రం లారెన్స్‌ ముందు చిన్న బోయారు.

లారెన్స్‌ ఇచ్చిన విరాళంతో వారంతా కూడా తల దించుకునే పరిస్థితి వచ్చిందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. లారెన్స్‌ కేవలం ఈ విపత్తు సమయంలోనే కాకుండా వందలాది మంది అనాధలను వికలాంగులను తన ఛారిటీ ద్వారా సాకుతున్నాడు. ఆయన మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఫ్యాన్స్‌ పొగడ్తలు కురిపిస్తున్నారు.

వందల కోట్ల రూపాయలు సంపాదించే సూపర్‌ స్టార్స్‌ కోటి రూపాయలు విరాళం ఇచ్చేందుకు కిందా మీదా పడుతున్నారు. అలాంటిది లారెన్స్‌ మూడు కోట్లు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం అంటూ సాదారణ జనాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లారెన్స్‌ ఇచ్చిన విరాళం స్టార్‌ హీరోలు తల వంచుకునేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.