Begin typing your search above and press return to search.

సినిమాల్లో బిజీ అయిన సీఎం భార్య‌!

By:  Tupaki Desk   |   8 Sept 2018 4:06 PM IST
సినిమాల్లో బిజీ అయిన సీఎం భార్య‌!
X
కొద్ది నెల‌ల క్రితం జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నికల‌లో జేడీఎస్-కాంగ్రెస్ కూట‌మి త‌ర‌ఫున కుమార స్వామి సీఎం ప‌ద‌వి చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య కింగ్ మేక‌ర్ గా మారిన కుమార స్వామి గురించి ఆ స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. అయితే, ఆయ‌న‌తోపాటు ఆయ‌న రెండో భార్య రాధికా కుమార‌స్వామి పేరు కూడా అప్ప‌ట్లో ట్రెండింగ్ లో ఉంది. రాధికా కుమార స్వామి సినిమాల్లో న‌టించేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. అర్జున్ హీరోగా జేడీ చక్రవర్తి కీల‌క‌మైన పాత్ర పోషిస్తోన్న ‘కాంట్రాక్ట్’ అనే తెలుగు సినిమాలో ఆమె నటిస్తోంది. తెలుగుతో పాటు కన్నడ - తమిళ భాష‌ల్లో కూడా ఈ సినిమాను ఒకేసారి రూపొందించ‌బోతున్నారు. దీంతోపాటు, మ‌రో మూడు సినిమాల‌కు కూడా రాధికా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో తార‌క ర‌త్న హీరోగా న‌టించిన `భ‌ద్రాద్రి రాముడు`తో రాధికా తెలుగులో తెరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత కుమార‌స్వామిని వివాహం చేసుకున్న రాధిక సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత ఆమె ఓ పాప‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో కొంత‌కాలంగా సినిమాల‌కు గ్యాప్ వ‌చ్చింది. తాజాగా ఆమె `కాంట్రాక్ట్` సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. దాంతో పాటు, `రాజేంద్ర పొన్న‌ప్ప‌` - `బైరా దేవి` - `నిమాగై` ప్రాజెక్ట్ ల‌కు రాధికా ఓకే చెప్పారట‌. ఓ ప‌క్క రాధిక భ‌ర్త కుమార స్వామి రాజ‌కీయాల్లో బిజీగా ఉంటే....మ‌రోప‌క్క రాధిక సినిమాల‌తో బిజీ అయ్యారు. చాలా గ్యాప్ త‌ర్వాత రీఎంట్రీ ఇస్తోన్న రాధిక.....శాండల్ వుడ్ లో కుర్ర హీరోయిన్ల‌కు ఏమాత్రం పోటీ ఇవ్వ‌గ‌ల‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.