Begin typing your search above and press return to search.

20 రోజుల్లో 'రాధేశ్యామ్' బీజీఎమ్ సాధ్యమేనా థమన్..?

By:  Tupaki Desk   |   27 Dec 2021 5:56 AM GMT
20 రోజుల్లో రాధేశ్యామ్ బీజీఎమ్ సాధ్యమేనా థమన్..?
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ చేయబడిన పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు రీరికార్డింగ్ మీద ఫోకస్ పెట్టిన చిత్ర బృందం.. దీని కోసం ఎస్ఎస్ థమన్ ను రంగంలోకి దింపింది.

'రాధే శ్యామ్' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సౌత్, నార్త్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ సినిమాకు మ్యూజిక్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు దక్షిణాది భాషలకు జెస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకురొస్తే.. మిథున్ - అను మాలిక్ - మనన్ భరద్వాజ్ హిందీ వెర్షన్ కు మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్సన్స్ కు ఆర్.ఆర్ అందించే బాధ్యతను థమన్ మీద పెట్టారు.

థమన్ 'రాధే శ్యామ్' కు నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా థమన్ ట్వీట్ చేస్తూ.. ''ప్రేమతో !! ఈ చిత్రం ప్రేమతో నిండి ఉంది. వాలెంటైన్స్ డేని ప్రపంచమంతా కాస్త ముందుగానే జరుపుకుంటుంది. మళ్లీ మళ్లీ మళ్లీ ప్రేమలో పడిపోతాం'' అని పేర్కొన్నారు. అయితే విడుదల మూడు వారాలే సమయం ఉంది.. ఇంత తక్కువ టైంలో ఆర్.ఆర్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో ఎలా చేయించగలరని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.

ఇదే విషయం పై ఓ ప్రభాస్ అభిమాని సోషల్ మీడియా వేదికగా తమన్ ని ప్రశ్నించారు. ''20 రోజుల డెడ్‌ లైన్‌ తో సినిమా మొత్తానికి BGM కంపోజ్ చేయడం సాధ్యమేనా.. అది కూడా మాగ్నమ్ ఓపస్ 'రాధే శ్యామ్' చిత్రానికి'' అని ట్వీట్ చేశారు. దీనికి థమన్ స్పందిస్తూ.. ''అవును, సినిమా కంటెంట్‌ నిజం అయినప్పుడు.. మనం దానిని పూర్తి చేయగలం. ఎంత వరకైనా వెళ్లి లక్ష్యాలను చేరుకోగలం. 'రాధే శ్యామ్' బ్లాక్ బస్టర్. ఇది మాత్రం ఫిక్స్'' అని సమాధానమిచ్చారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న తమన్.. ఇటీవల 'క్రాక్' 'వకీల్ సాబ్' 'అఖండ' చిత్రాలకు తన ఆర్.ఆర్ తోనే ప్రాణం పోశారు. ఇప్పుడు 'రాధే శ్యామ్' చిత్రానికి కూడా అదిరిపోయే నేపథ్య సంగీతం కోసం ఆల్రెడీ తమన్ వర్క్ స్టార్ట్ చేశాడు. మరి ఇది ఏ స్థాయిలో ఉంటుందో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

కాగా, పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన 'రాధే శ్యామ్' చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ ఎంటర్టైన్మెంట్స్ - గోపీ కృష్ణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. రవీంధర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.