Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ రాధేశ్యామ్.. మ‌రో వాయిదా నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   30 March 2021 5:30 AM GMT
ప్ర‌భాస్ రాధేశ్యామ్.. మ‌రో వాయిదా నిజ‌మేనా?
X
డార్లింగ్ ప్ర‌భాస్ - పూజా హెగ్డే జంట‌గా రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన రాధేశ్యామ్ జూలైలో విడుదలకు సిద్ధమవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చాలా కాలం క్రితం పూర్తయింది. జూలై 30 విడుదల తేదీ అంటూ ప్ర‌క‌టించారు. కానీ చెప్పిన స‌మ‌యానికి ఈ సినిమా రిలీజ‌వుతుందా? అంటే.. అందుకు ర‌క‌ర‌కాల సందేహాలు తాజాగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ ముంబై- మ‌హారాష్ట్ర‌ను ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌నాలు అశ్ర‌ద్ధ‌కు మూల్యం చెల్లిస్తున్నారు. కార‌ణం ఏదైనా కానీ దీని ప్ర‌భావం అన్ని రంగాల అభివృద్ధిపైనా ప‌డుతోంది. మ‌హ‌మ్మారీ ఉధృతిని ఆప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా సినీప్ర‌పంచానికి ఇది ఇక్క‌ట్లు తెచ్చి పెడుతోంది. ఇక‌ ముంబైలో పూర్తి చేయాల్సిన రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు మ‌హ‌మ్మారీ వ‌ల్ల‌ ఆటంకాలేర్ప‌డ్డాయ‌‌ని తెలుస్తోంది. నిర్మాణానంత‌ర ప‌నుల్లో భాగంగా అత్యంత‌ కీల‌క‌మైన వీఎఫ్ ఎక్స్ ప‌నులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప‌నిని ఇప్పుడు ముంబై నుంచి హైద‌రాబాద్ కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఒక‌వేళ ఇదే జ‌రిగితే ప‌నులు ఆల‌స్య‌మై రిలీజ్ తేదీపైనా ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతానికి హైదరాబాద్ లో కేసులు కూడా పెరుగుతున్నా.. ఇప్ప‌టికి పరిస్థితి అదుపులో ఉంది. అదేగాక తెలంగాణ‌లో ఎటువంటి లాక్ డౌన్ ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని హైద‌రాబాద్ కి షిఫ్ట్ చేస్తున్నార‌ట‌.

మూడేళ్లుగా ఈ సినిమా రాక కోసం ప్ర‌భాస్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తూనే ఉన్నారు. మ‌రో వాయిదా లేకుండా రిలీజ్ చేసేందుకు యువి బృందాలు కృషి చేస్తాయ‌ని ఆశిస్తున్నారు. అయితే తాజా స‌న్నివేశంపై చిత్ర‌బృందం అధికారికంగా స్ప‌ష్ఠ‌త‌ను ఇవ్వాల్సి ఉంటుంది.