Begin typing your search above and press return to search.

రికార్డు రేటు... రాధేశ్యామ్‌ పై ఆ ప్రభావమే లేదు

By:  Tupaki Desk   |   30 April 2021 3:30 PM GMT
రికార్డు రేటు... రాధేశ్యామ్‌ పై ఆ ప్రభావమే లేదు
X
ప్రభాస్‌ సాహో సినిమా విడుదల అయ్యి దాదాపుగా రెండు సంవత్సరాలు అవ్వబోతుంది. సాహో విడుదలకు ముందే రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ను ప్రారంభించారు. అప్పటి నుండి రాధే శ్యామ్ గురించిన చర్చ ప్రభాస్ అభిమానులతో పాటు అందరిలో కూడా ఉంది. రాధేశ్యామ్‌ సినిమా చాలా ఆలస్యం అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది వచ్చేనా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. కరోనా దెబ్బతో రాధే శ్యామ్‌ మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది. సాదారణంగా సినిమాలు ఆలస్యం అయితే క్రేజ్‌ తగ్గుతుంది. కాని రాధే శ్యామ్‌ విషయంలో మాత్రం అలా జరగడం లేదు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్‌ సినిమా ఎప్పుడు విడుదల అయితే అప్పుడు చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సినిమాకు ఉన్న క్రేజ్ పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమాను పంపిణీ చేసేందుకు బయ్యర్లు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్‌ లో ఈ సినిమా ను ఏకంగా 30 కోట్లకు కొనుగోలు చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే పాతిక కోట్లతో ప్రముఖ ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడట. సినిమా విడుదల సమయానికి ఆ మొత్తం 30 కోట్ల వరకు కూడా అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరింది. రెండు మూడు వారాల షూట్‌ తో మొత్తం షూటింగ్‌ పూర్తి అవుతుందని అంటున్నారు. ఆ షూటింగ్‌ ను మొదలు పెట్టాలనుకున్న సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలై ఆగిపోయింది. సినిమా ను జులై 30న విడుదల చేయాలని భావించారు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ మరో సారి రాధేశ్యామ్‌ అనుకున్న సమయంకు రానిచ్చే అవకాశం కనిపించడం లేదు. సినిమా ఎంతగా ఆలస్యం అవుతున్నా కూడా బిజినెస్ పై మాత్రం కనీసం ప్రభావం కనిపించడం లేదు.