Begin typing your search above and press return to search.

పిక్ టాక్: క్యూరియాసిటీ రేకెత్తించేలా 'రాధే శ్యామ్' ఫస్ట్ సింగిల్ 'ఈ రాతలే'..!

By:  Tupaki Desk   |   13 Nov 2021 6:24 AM GMT
పిక్ టాక్: క్యూరియాసిటీ రేకెత్తించేలా రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ ఈ రాతలే..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ''రాధే శ్యామ్''. 1970స్ కాలం నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి కె కె రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

'రాధే శ్యామ్' చిత్రం నుండి 'ఈ రాతలే' అనే లిరికల్ వీడియోని నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో మాత్రమే ఈ సాంగ్ విడుదలవుతుంది. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన ఈ పాటను మరో సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.. గాయని హరిణి ఇవటూరి తో కలిసి ఆలపించారు. తెలుగు వెర్షన్ కు కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు.

రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఓ అమ్మాయి కారులో నీటిలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. జ్యోతిష్య శాస్త్రానికి సైన్స్ కు లింక్ చేస్తూ ఈ వింటేజ్ లవ్ స్టొరీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ లో ప్రభాస్ ను చేయి చూసి మనిషి తలరాత చెప్పే విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడుగా పరిచయం చేశారు. ఇప్పుడు 'ఈ రాతలే' పాట కూడా ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఉంటుందేమో చూడాలి. మొత్తం మీద ఈ పోస్టర్ సాంగ్ మీద క్యూరియాసిటీని రేకెత్తిస్తోందని చెప్పవచ్చు.

కాగా, 'రాధే శ్యామ్' చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గీతాకృష్ణ సంస్థలు కలసి నిర్మిస్తున్నారు. వంశీ - ప్రమోద్ - భూషణ్ కుమార్ - ప్రశీద దీనికి నిర్మాతలు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు రెండు నెలలు మాత్రమే సమయం ఉన్నా.. ఇంకా ఫస్ట్ సింగిల్ వదిలి కూడా వదలకపోవడం.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచడం లేదని డార్లింగ్ అభిమానులు నిరాశ చెందారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'రాధే శ్యామ్' టీమ్ ఫ్యాన్స్ మొర ఆలకించి ఫస్ట్ సింగిల్ ని రెడీ చేసింది.