Begin typing your search above and press return to search.

ఈ సినిమాలో ఫైట్లు ఉండవు .. యుద్ధం ఉంటుంది!

By:  Tupaki Desk   |   24 Dec 2021 4:37 AM GMT
ఈ సినిమాలో ఫైట్లు ఉండవు .. యుద్ధం ఉంటుంది!
X
యూవీ క్రియేషన్స్ వారు వందల కోట్ల బడ్జెట్ తో .. వర్ధమాన దర్శకులతో ప్రయోగాలు చేస్తుండటం విశేషం. 'రాధేశ్యామ్' వంటి ఒక భారీ బడ్జెట్ సినిమాను వారు రాధాకృష్ణ కుమార్ కి అప్పగించడం ఆశ్చర్యమే. గతంలో ఆయన ఎక్కువగా గోపీచంద్ సినిమాలకు రచయితగా పనిచేశాడు. గోపీచంద్ హీరోగా చేసిన 'జిల్' సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత గ్యాప్ తీసుకున్న ఆయన, ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ను అందుకోవడం మామూలు విషయం కాదు. ఆయనపై .. ఆయన తయారు చేసిన కథపై వారికి గల నమ్మకమే అందుకు కారణమనుకోవాలి.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ .. "ఈ సినిమాను తీయడానికి నాలుగేళ్లు పట్టింది .. రాయడానికి 18 ఏళ్లు పట్టింది. ఫస్టు టైమ్ నేను ఈ పాయింట్ మా గురువుగారు చంద్రశేఖర్ యేలేటిగారి దగ్గర విన్నాను. ఈ 18 ఏళ్లలో ఇండియాలో ఉన్న పెద్ద రైటర్స్ అందరినీ పిలిపించి రాయించాము. కానీ కథకి ముగింపు దొరకడం లేదు .. కథ పూర్తి కావడం లేదు. ఆ టైమ్ లో యేలేటి గారు ఒక మాట అన్నారు. ''జాతకాల మీద చేస్తున్నావ్ .. ఈ కథ ఎవరికి రాసిపెట్టుందో" అని. ఇది ప్రభాస్ గారికి రాసిపెట్టుంది.

ప్రభాస్ తో ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ పాయింటును మా గురువుగారి దగ్గర అడిగి తీసుకున్నాను. ఒక ఫిలాసఫీని ఒక కథగా రాసి ఆయనకి వినిపించాను .. ఆయనకి నచ్చేసింది. ఈ సినిమాలో ఫైట్లు ఉండవు .. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలు ఉంటాయి. ఛేజ్ లు ఉండవు .. ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి సప్త సముద్రాలు ఈదుతూ ముందుకు వెళ్లే జర్నీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన ఈ ట్రైలర్ .. ఈ సినిమాకి ఇన్విటేషన్ లాంటిది. ఈ సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.

ముందుగా మనోజ్ పరమహంస గారి గురించి చెప్పాలి .. ఆయన ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా అది బృందావనంలా ఉంటుంది. మా ప్రొడక్షన్ డిజైనర్ గారికీ .. మా నిర్మాతలకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. పూజ నీ డేటాఫ్ బర్త్ ఎప్పుడో నాకు తెలియదు .. కానీ ఈ సినిమా కోసమే నువ్వు పుట్టావు. నీ కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుంది. ప్రేరణ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము .. ఆ పాత్రకి ఆమె పెర్ఫెక్ట్ గా సరిపోయింది. ఈ సినిమాకి పనిచేసిన సంగీత దర్శకులంతా కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే, ఆయనకి ఆయనే సాటి. ప్రభాస్ లాంటి ఫ్రెండ్ .. ప్రభాస్ లాంటి గురువు అందరికీ ఉండాలి. ఫ్యాన్స్ .. జనవరి 14న ప్రేమించుకుందాం .. థ్యాంక్యూ" అంటూ ముగించాడు.