Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ కోట్టేసిన అందాలరాశి!

By:  Tupaki Desk   |   18 Nov 2021 5:01 AM GMT
బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ కోట్టేసిన అందాలరాశి!
X
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికల జాబితాలో రాశి ఖన్నా కూడా కనిపిస్తుంది. ముద్దుగా .. బొద్దుగా .. ముద్దమందారంలా కనిపించే రాశి ఖన్నా, 'ఊహలు గుసగుసలాడే ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. కుర్రాళ్ల గుండెల్లో ఊహాసుందరిలా ఉండిపోయింది. 'జిల్' .. 'బెంగాల్ టైగర్' .. 'సుప్రీమ్' వంటి సినిమాలు ఆమెకి హిట్లు ఇచ్చేసి నిలబెట్టాయి. 'జై లవ కుశ' సినిమా తరువాత ఆమెకు వరుస ఫ్లాపులు పడుతుండగా, వరుణ్ తేజ్ జోడిగా చేసిన 'తొలిప్రేమ' ఆదుకుంది.

అప్పటి వరకూ తెలుగు సినిమాలను మాత్రమే నమ్ముకుని, నిదానమే ప్రధానం అన్నట్టుగా తన కెరియర్ ను కొనసాగించిన రాశి ఖన్నా, ఈ సినిమా తరువాత నుంచి కోలీవుడ్ పై కూడా దృష్టి పెట్టింది. ఇంత గ్లామర్ పెట్టుకుని ఇలా కామ్ గా ఉండటమేమిటని ఎవరు చెప్పారోగానీ, అక్కడి నుంచి ఆమె స్పీడ్ పెంచింది. కాస్త స్లిమ్ గా మారిపోయి తమిళంలో కూడా బాగానే అవకాశాలను అందుకుంటోంది. తెలుగు .. తమిళ సినిమాలు చేస్తున్న ఆమెకి సహజంగానే బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి.

హిందీలో వెబ్ సిరీస్ లు చేయడానికి ఆమె అంగీకరించడమే కాకుండా అక్కడి సినిమాలలో అవకాశాలను అందుకునే దిశగా గట్టిగానే ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల ఫలితంగా ఇప్పుడు కరణ్ జోహార్ సినిమాలో ఒక ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇది ఒక యాక్షన్ ఫ్రాంఛైజీ .. ఈ సినిమాతో పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి 'యోధ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా .. దిశా పటాని ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు. మరో కథానాయికాగా రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు.

ఈ సినిమాలో రాశి ఖన్నాకు ఛాన్స్ దొరకడం నిజమే అయితే, ఇక ఆమె జోరు కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మాత్రం గ్లామర్ కోసం అక్కడి కుర్రాళ్లు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగులోను బిజీగానే ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమాను పూర్తి చేసిన ఆమె, ఆ తరువాత సినిమాగా గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' చేస్తోంది. అలాగే తమిళంలో 'సర్దార్'తో కలిపి నాలుగు సినిమాలు చేస్తోంది. అందం అందరికీ అందంగానే కనిపిస్తుంది గనుక, అవకాశాలు దానిని వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి మరి!