Begin typing your search above and press return to search.

అప్పుడు రవితేజ.. ఇప్పుడు శేష్

By:  Tupaki Desk   |   27 Feb 2016 8:53 AM GMT
అప్పుడు రవితేజ.. ఇప్పుడు శేష్
X
పొట్లూరి వర ప్రసాద్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న అతి పెద్ద నిర్మాత ఈయనేనేమో. వేల కోట్లకు అధిపతి అయి ఉండీ.. సినిమాల మీద మక్కువతో నాలుగేళ్ల నుంచి తమిళ - తెలుగు భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ గా నిలుస్తున్న ఆయన.. వ్యాపారాల్లో సక్సెస్ అయినట్లుగా సినిమాల్లో మాత్రం సక్సెస్ రేట్ సాధించలేకపోయారు. తొలి సినిమా ‘వర్ణ’ పెద్ద డిజాస్టర్‌ గా నిలవగా.. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా మెజారిటీ ఫెయిల్యూర్సే. ఇప్పటిదాకా ఆయన బేనర్లో ఏకైక హిట్టు ‘బలుపు’ మాత్రమే. ఈ మధ్య సైజ్ జీరో - బెంగళూరు నాట్కల్ సినిమాలు తీవ్రంగా నిరాశ పరచడంతో పీవీపీకి పెద్ద దెబ్బే తగిలింది.

ఇలాంటి టైంలో పీవీపీ సంస్థలో మళ్లీ సంతోషం నింపుతోంది ‘క్షణం’ సినిమా. పీవీపీ బేనర్ శైలికి భిన్నంగా ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించారు. కేవలం కోటి రూపాయల్లో సినిమా తీసి.. ఇంకో కోటి రూపాయలతో పబ్లిసిటీ చేశారు. ఆ ప్రయత్నం వృథా పోలేదు. సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. మంచి టాక్ కూడా వచ్చింది. దీంతో ‘బలుపు’తో రవితేజ సక్సెస్ అందించాక.. మళ్లీ ఇప్పుడు ‘క్షణం’ సినిమాను అన్నీ తానై నడిపించిన శేష్ పీవీపీ సంస్థకు సక్సెస్ రుచి చూపించాడు. యునానమస్‌గా హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. పీవీపీ సంస్థ తమదైన శైలిలో ప్రమోట్ చేయగలిగితే సినిమా రేంజి బాగా పెరిగే అవకాశముంది. వచ్చే నెలలో విడుదల కాబోయే ‘ఊపిరి’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఆ సినిమాతో పీవీపీ మరో హిట్టు కొడతారేమో చూడాలి.