Begin typing your search above and press return to search.

నెగెటివ్ టాక్ ను ఎదిరించిన 'పుష్ప' రాజ్!

By:  Tupaki Desk   |   10 Jan 2022 4:43 AM GMT
నెగెటివ్ టాక్ ను ఎదిరించిన పుష్ప రాజ్!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'ఆర్య' .. 'ఆర్య 2' సినిమాల కారణంగా, 'పుష్ప' సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కథా నేపథ్యం .. ప్రధానమైన పాత్రల లుక్స్ .. ప్రతి నాయకుడిగా మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్ ను తీసుకోవడం ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడానికి కారణమైంది. దేవిశ్రీ ప్రసాద్ ఒక్కో పాటతో ఈ సినిమాను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తూ వెళ్లాడు. ఇక సమంత ఐటమ్ ను ప్రత్యేక ఆకర్షణగా నిలబెట్టాడు. ఇలా సినిమా విడుదల సమయానికి, తొలి ఆటనే చూసేయాలనే ఆసక్తిని .. ఆత్రుతను అందరిలోను పెంచేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, వివిధ భాషల్లో భారీస్థాయిలో విడుదలైంది. అయితే సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్లంతా బన్నీ యాక్టింగ్ అదుర్స్ అన్నారేగానీ .. సినిమా సూపర్ అనలేకపోయారు. కొన్ని పాత్రల నుంచి తాము ఆశించిన అవుట్ పుట్ లేదనే అసంతృప్తినే వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ విషయం పట్ల ఎవరిలోనూ సంతృప్తి కనిపించలేదు. మేకర్స్ రెండవ పార్టు ఆలోచన చేయకపోవచ్చనే టాక్ కూడా వచ్చేసింది. దాంతో సుకుమార్ చాలా టెన్షన్ పడ్డాడు.

ఆ సమయంలో బన్నీ చాలా తెలివిగా సక్సెస్ పార్టీలను ప్లాన్ చేశాడు. కొన్ని ప్రాంతాలను సెట్ చేసుకుని ఈ సినిమా టీమ్ తో సందడి చేస్తూ, నెగెటివ్ టాక్ వైపు నుంచి జనం దృష్టిని మళ్లించాడు. సెకండ్ పార్ట్ ఇంతకి మించి ఉంటుందంటూ, కంటెంట్ పై తమకి గల నమ్మకాన్ని జనంలోకి తీసుకుని వెళ్లడానికి చాలా కష్టపడ్డాడు. థ్యాంక్యూ మీట్ లో బన్నీని సుకుమార్ ఆకాశానికి ఎత్తేయడానికికి కారణం ఇదే. ఇక చాలామంది బయట టాక్ తో సంబంధం లేకుండా బన్నీ కొత్త బాడీ లాంగ్వేజ్ ను తప్పకుండా చూడాలనే ఉద్దేశంతో థియేటర్లకు వెళ్లడం కూడా కలిసొచ్చింది.

ఈ నేపథ్యంలోనే హిందీ వెర్షన్ నుంచి భారీ రెస్పాన్స్ రావడం మొదలైంది. సినిమా సూపర్ అంటూ అక్కడి స్టార్ హీరోలు చేసిన ట్వీట్లు కూడా వసూళ్లు పెరగడానికి దోహదం చేశాయి. మరో వైపు నుంచి తమిళ .. మలయాళ భాషల నుంచి కూడా ఈ సినిమా గట్టిగానే వసూళ్లను రాబట్టింది. ఇతర భాషల్లోనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతుందంటే, 'చిన్న చిన్న లోపాలను మనం గాని భూతద్ధంలోగాని చూశామా ఏంటి?' అనే డౌటు సహజంగానే ఇక్కడి ప్రేక్షకులకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్ నుంచి ఓటీటీకి వచ్చేసరికి టాక్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు అందరి నోటా వినిపించే ఒకే ఒక్క మాట .. 'పుష్ప' బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాపై వచ్చిన నెగెటివ్ టాక్ ను ఇంత నీట్ గా తుడిచేయడం నిజంగా గొప్ప విషమే.