Begin typing your search above and press return to search.

ప్రిన్స్ భరత తో పుష్ప'.. ఒకే లొకేషన్ లో తండ్రీకూతుళ్ళ షూటింగ్..!

By:  Tupaki Desk   |   9 Aug 2021 2:32 PM GMT
ప్రిన్స్ భరత తో పుష్ప.. ఒకే లొకేషన్ లో తండ్రీకూతుళ్ళ షూటింగ్..!
X
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక బన్నీ ముద్దుల కుమార్తె అల్లు అర్హ కూడా గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న 'శాకుంతలం' సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు వారు నటిస్తున్న ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకే లొకేషన్ లో జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో 'పుష్ప' షూటింగ్ గ్యాప్‌ లో పుష్పరాజ్ గెటప్ లో ఉన్న అల్లు అర్జున్.. 'శాకుంతలం' సెట్స్ కు వెళ్లి ప్రిన్స్ భరత గెటప్ లో ఉన్న కూతురు అర్హ ని కలుసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన బన్నీ.. తన జీవితంలో ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదని అన్నారు. ఈ సందర్భంగా భరత గెటప్ లో ఉన్న అర్హ ని ఎత్తుకొని గుణశేఖర్ తో నడుస్తున్న ఓ ఫోటోని షేర్ చేశాడు. ఇందులో ఇద్దరి లుక్స్ బయట పడకుండా జాగ్రత్త పడ్డారు.

''ఈ రోజు నేను నా కుమార్తె అర్హ ఒకే లొకేషన్‌ లో వేర్వేరు చిత్రాల షూటింగ్స్ చేస్తున్నాము. దీంతో నేను ఆమె సెట్ ను సందర్శించాను. 15-20 సంవత్సరాల తర్వాత ఇలాంటి సందర్భం వస్తుందని నేను భావించాను. కానీ ఇది చాలా త్వరగా జరిగింది. 'శాకుంతలం' లో భరత ని పుష్ప మీట్ అయ్యాడు. ఇది గుర్తుండిపోయే యాదృచ్చికమైన రోజు'' అని అల్లు అర్జున్ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ - స్నేహరెడ్డి దంపతులు ఇటీవలే 'శాకుంతలం' సెట్స్ కు వెళ్లి తన ముద్దుల కూతురు అల్లు అర్హ నటన చూసి తెగ మురిసిపోయారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక బన్నీ సినిమాల కోసం ఉపయోగించే 'ఫాల్కనో' కార్వాన్ ను కుమార్తె సౌకర్యం కోసం కేటాయించారు. అల్లు ఫ్యామిలీ నాలుగో తరం సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతుండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాగా, అల్లు అర్జున్ - అల్లు అర్హ నటిస్తున్న సినిమాలు రెండూ భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ''పుష్ప: ది రైజ్'' చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు ''శాకుంతలం'' చిత్రాన్ని దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ - గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై దిల్‌రాజు - నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమంత అక్కినేని ఇందులో టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.