Begin typing your search above and press return to search.

సారథి చేరిన 'పుష్ప'.. ఏం జరుగుతోంది!

By:  Tupaki Desk   |   28 Sep 2021 11:30 PM GMT
సారథి చేరిన పుష్ప.. ఏం జరుగుతోంది!
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్ప సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పుష్ప ను ఈ ఏడాది చివరి వరకు విడుదల చేయాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. వచ్చే ఏడాదిలో పుష్ప పార్ట్ 2 ను విడుదల చేసేలా ముందుగానే నిర్ణయించుకున్నారు. అందుకే కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయినా కూడా పుష్ప ను స్పీడ్ గా ముగించి ఈ ఏడాది లోనే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ మరియు ఇతర నటీ నటులపై ఇటీవలే మారేడుమిల్లి అటవి ప్రాంతంలో చిత్రీకరణ జరిపారు. అక్కడ షూటింగ్‌ ను ముగించిన చిత్ర యూనిట్ సభ్యులు మళ్లీ హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్‌ ను ప్రారంభించారు. హైదరాబాద్‌ సారధి స్టూడియోలో పుష్ప కోసం వేసిన ప్రత్యేక సెట్టింగ్‌ లో సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇన్ని రోజులు యాక్షన్‌ సన్నివేశాలు.. చేజింగ్ లు ఫైటింగ్ లు షూట్‌ చేసిన దర్శకుడు సుకుమార్‌ ప్రస్తుతం ఇంటీరియర్‌ షాట్స్ ను సారధి స్టూడియోలో వేసిన సెట్టింగ్‌ లో తీస్తున్నాడు.

ఈ షెడ్యూల్‌ను వచ్చే నెల మొదటి వారం వరకు ముగించబోతున్నారు. ఆ తర్వాత తుది షెడ్యూల్‌ ను ప్రారంభిస్తారని.. సినిమాను అక్టోబర్ లో పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సుకుమార్ ఈ సినిమా ను చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్‌ సినిమా లోని యాక్షన్‌ సన్నివేశాలను తలదన్నేలా ఉంటాయని సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు చెప్పడంతో అంచనాలు మరింతగా పెరిగిన విషయం తెల్సిందే. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకోవడం ఖాయంగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అల్లు అర్జున్ మరియు సుకుమార్‌ ల గత చిత్రాలు నాన్‌ బాహుబలి రికార్డులను దక్కించుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

చిత్రీకరణ గత ఏడాది ఆరంభంలో అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. కరోనా వల్ల షూటింగ్‌ సాగుతూ.. ఆగుతూ వచ్చింది. ఎట్టకేలకు పుష్ప పార్ట్‌ 1 ను ముగింపు దశకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం సారధి స్టూడియోలో వేసిన సెట్టింగ్‌ లో బన్నీ మరియు రష్మిక మందన్నా పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బన్నీ ఎక్కువగా అడవిలో లారీ డ్రైవర్ గానే కనిపిస్తాడు. చాలా తక్కువ సన్నివేశాల్లో మాత్రమే ఇండోర్ లో కనిపిస్తాడని సమాచారం. అందుకే ఎక్కువగా మారేడుమిల్లి ఇంకా పలు అటవి ప్రాంతాల్లో చిత్రీకరన జరిపారు. అల్లు అర్జున్‌ మార్క్‌ స్టైలిష్‌ లుక్ ఇందులో కనిపించదు. కాని ఐకానిన్‌ స్టార్‌ అన్న పేరుకు సార్థకం అన్నట్లుగా బన్నీ పుష్ప లుక్‌ ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న పుష్ప పార్ట్‌ 1 నుండి ఇప్పటికే మొదటి పాట వచ్చేసింది. రెండవ పాట ను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. బన్నీ.. సుకుమార్‌.. దేవిశ్రీ ల కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌ గా హిట్‌ సాధించి ఆ తర్వాత కమర్షియల్‌ గా హిట్ ను సాధించాయి. అందుకే పుష్ప పార్ట్‌ 1 కూడా అదే సెంటిమెంట్‌ తో వీరికి హ్యాట్రిక్ ఇస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్‌ ఫాహద్‌ ఫాజిల్ నటించడం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరగడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఇంట్రెస్ట్‌ ను క్రియేట్‌ చేయడం జరిగింది.