Begin typing your search above and press return to search.

'శ్రీవల్లి' సాంగ్ ప్రోమో: సిద్ శ్రీరామ్ మరోసారి మ్యాజిక్ చేశారుగా..!

By:  Tupaki Desk   |   12 Oct 2021 7:41 AM GMT
శ్రీవల్లి సాంగ్ ప్రోమో: సిద్ శ్రీరామ్ మరోసారి మ్యాజిక్ చేశారుగా..!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. రష్మిక మందన్న హీరోయిన్ గా.. మలయాళ నటుడు ఫాహాద్ విలన్ గా నటిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా బన్నీ.. గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో లక్కీ బ్యూటీ కనిపించనున్నారు.

రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చిన ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ రాబోతున్నాయి.

ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్ - టీజర్ - 'దాక్కో దాక్కో మేక' సాంగ్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. అలానే ఇటీవల వచ్చిన శ్రీవల్లి లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు సెకండ్ సింగిల్ ను విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దసరా సందర్భంగా అక్టోబర్ 13న 'శ్రీవల్లి' అనే పాటను ప్రేక్షకులకు అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో తాజాగా 'శ్రీవల్లి' పాటకు సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. 'చూపే బంగారమాయనే.. శ్రీవల్లీ.. మాటే మణిక్యమాయనే.. చూపే బంగారమాయనే.. శ్రీవల్లీ.. నవ్వే నవ రత్నమాయనే..' అంటూ సాగిన ఈ గీతం శ్రీతలను అలరిస్తోంది. శ్రీవల్లి ప్రేమలో పడిన పుష్పరాజ్ పాడుకుంటున్న పాట ఇది. 'రంగస్థలం' సినిమాలోని 'ఎంత చక్కగున్నావే' పాట తరహాలో పుష్ప సెకండ్ సింగిల్ ఉంటుందని అర్థం అవుతోంది.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ 'శ్రీవల్లి' పాటకు మంచి ట్యూన్ సమకూర్చారు. ఈ సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్సన్స్ ను మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడటం విశేషం. మరోసారి సిధ్ తన గానంతో ప్రేక్షకులను ఫిదా చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది. హిందీ పాటను మాత్రం యువ గాయకుడు జావేద్ అలీ ఆలపించారు. ఈరోజు ఐదు భాషలకు సంబంధించిన ప్రోమోలను వదిలారు. తెలుగు పాటకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. దీనిని బట్టి మిగతా భాషల్లో లిరిక్స్ రాసినట్లు తెలుస్తోంది. పూర్తి పాటను రేపు బుధవారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

బన్నీ - సుక్కూ కాంబోలో వచ్చే సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. 'పుష్ప' కోసం మరో సూపర్ హిట్ ఆల్బమ్ ని రెడీ చేశారు. మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముత్యంశెట్టి మీడియా వారు దీనికి సహ నిర్మాతలు.