Begin typing your search above and press return to search.

పుష్ప మాసివ్ పార్టీ ఎక్కడంటే..?

By:  Tupaki Desk   |   21 Dec 2021 5:00 AM IST
పుష్ప మాసివ్ పార్టీ ఎక్కడంటే..?
X
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''పుష్ప: ది రైజ్''. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర భాషల్లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

ఈ క్రమంలో 'పుష్ప' పార్ట్-1 మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 173 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. 2021లో ఇండియాలో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచిందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో సక్సెస్ మాసివ్ సక్సెస్ పార్టీ నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

'పుష్ప' సక్సెస్ సెలబ్రేషన్స్ ను మంగళవారం తిరుపతిలో జరగనుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో సాయంత్రం గ్రాండ్ గా పార్టీ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. సినిమాలో చిత్తూరు నేపథ్యాన్ని తీసుకున్న మేకర్స్.. ఇప్పుడు విజయోత్సవ సభ కోసం ఆ ప్రాంతాన్నే వేదికగా చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.

కాగా, 'పుష్ప' సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. పుష్పరాజ్ అనే యువకుడు కూలీగా జీవితాన్ని ప్రారంభించి.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే లీడర్ గా ఎలా ఎదిగారనేది మొదటి భాగంలో చూపించారు. ఇందులో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ భరద్వాజ్ - అజయ్ ఘోష్ - అజయ్ - శత్రు - 'పలాస 1978' ఫేమ్ జగదీశ్ - ధనుంజయ కీలక పాత్రలు పోషించారు. సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. రామకృష్ణ - మోనిక ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. కార్తీక శ్రీనివాస్ - రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనర్ గా వ్యవహరించారు.

'పుష్ప' చిత్రాన్ని ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. వచ్చే ఏడాది రెండో భాగాన్ని ''పుష్ప: ది రూల్'' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫిబ్రవరి - మార్చి నెలల్లో సెకండ్ పార్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.