Begin typing your search above and press return to search.

'పుష్ప: ది రైజ్' షూటింగ్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   3 Sep 2021 11:30 AM GMT
పుష్ప: ది రైజ్ షూటింగ్ అప్డేట్..!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ''పుష్ప''. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ చిత్రాన్ని ఒక సినిమాగా చేయాలని స్టార్ట్ చేసి.. ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా లేట్ అవుతూ ఉండటం.. కథను రెండుగా చేసే స్పాన్ ఉండటంతో 2 పార్ట్స్ చేయాలనే డెసిజన్ తీసుకున్నారు. గతేడాది నవంబర్ లో ఈ నిర్ణయం తీసుకున్న సుక్కూ అండ్.. దానికి తగ్గట్టుగా సినిమాని రెడీ చేస్తున్నారు.

ఫస్ట్ పార్ట్ ని పాన్ ఇండియా స్థాయిలో 'పుష్ప: ది రైజ్' పేరుతో క్రిస్మస్ సీజన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం.. మరో రెండు వారాల్లో టాకీ మొత్తాన్ని కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ లో హీరో - విలన్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీయాల్సిన యాక్షన్ సీన్స్ కోసం మళ్ళీ మారేడుమిల్లి అడవులకు పయనమయ్యారు. పుష్పరాజ్ - భన్వర్ సింగ్ షెకావత్ మధ్య చిత్రీకరించే యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. మిగిలిన పాటలను కూడా వీలైనంత త్వరగా షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాల మీద దృష్టి పెట్టనున్నారు.

కాగా, 'పుష్ప: ది రైజ్' చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. పుష్పరాజ్‌ ని ఢీ కొట్టే ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహాద్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన హీరో విలన్ల ఫస్ట్ లుక్స్ - టీజర్ - 'దాక్కో దాక్కో మేక' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.