Begin typing your search above and press return to search.

'KGF 2' ను ఫాలో అవుతున్న 'పుష్ప 2'..?

By:  Tupaki Desk   |   20 April 2022 9:33 AM GMT
KGF 2 ను ఫాలో అవుతున్న పుష్ప 2..?
X
'పుష్ప' సినిమాతో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో అంచనాలకు మించి 100 కోట్లకు పైగాన వసూళ్ళు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో రెండో భాగాన్ని బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుంటున్నారు.

నిజానికి 'పుష్ప' పార్ట్-1 తర్వాత బోయపాటి శ్రీనుతో ఓ మూవీ చేయాలని బన్నీ ప్లాన్ చేసుకున్నారు. అయితే పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అవడం.. రెండో భాగం మీద అంచనాలు రెట్టింపు అవ్వడంతో ముందుగా ''పుష్ప: ది రూల్'' చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకొచ్చి.. ఈ ఏడాది చివర్లో సినిమాని విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు 'కేజీయఫ్ 2' రిలీజ్ తర్వాత ప్రణాళికలన్నీ మారిపోయాయని తెలుస్తోంది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ సినిమా 'కేజీయఫ్: చాప్టర్ 2' భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఫస్ట్ వీకండ్ లో 'బాహుబలి 2' - RRR సినిమాలను మించి గట్టి ప్రభావాన్ని చూపించింది. యాక్షన్ తో పాటుగా ఎలివేషన్ సన్నివేశాలు మరియు సెంటిమెంట్ వంటి అంశాలు ఉత్తరాది ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు 'పుష్ప' టీమ్ దీన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' సినిమాలో చూపించారు. పార్ట్-2 లోనే అసలైన కథ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో ఎమోషన్స్ - ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా చూకుంటున్నారట. పుష్పరాజ్ కు చిన్నతనంలో తండ్రితో ఉన్న అనుబంధాన్ని చూపించబోతున్నారట.

అల్లు అర్జున్ సైతం సుకుమార్ తో పాటుగా స్క్రిప్ట్ వర్క్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. 'పుష్ప' సినిమాలో తగ్గేదే లే అనే బన్నీ మేనరిజం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'పుష్ప 2' ద్వారా అంతకుమించి ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. అందుకే ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ను హోల్డ్ లో పెట్టి.. సుక్కూ సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టారని టాక్ నడుస్తోంది. మరి వచ్చే ఏడాది సమ్మర్ నాటికి రెడీ అయ్యే ఈ సినిమాతో సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి..

'పుష్ప 2' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ గా చేస్తుండగా.. మరికొందరు పాపులర్ నటులు ఇందులో భాగం కానున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవి శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.