Begin typing your search above and press return to search.

పూరి కల అలా మిగిలి పోకూడదు.. చిరు మంచి మనసు

By:  Tupaki Desk   |   9 April 2022 6:31 AM GMT
పూరి కల అలా మిగిలి పోకూడదు.. చిరు మంచి మనసు
X
మెగా స్టార్‌ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న గాడ్ ఫాదర్‌ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వాటిని కేవలం పుకార్లు అనుకున్నారు. కాని గాడ్‌ ఫాదర్ టీమ్‌ ముంబయి వెళ్లి అక్కడ సల్మాన్ ఖాన్‌ తో షూటింగ్ చేసుకుని వచ్చారు. షూటింగ్ ముగింపు దశకు వచ్చిన సమయంలో పూరి జగన్నాద్‌ కూడా గాడ్‌ ఫాదర్‌ తో కలిశాడు.

గత కొన్ని రోజులుగా పూరి జగన్నాద్‌ కు ఒక చిన్న పాత్రను గాడ్ ఫాదర్ మేకర్స్‌ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఇవి ఖచ్చితంగా పుకార్లే అని అంతా భావించారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా గాడ్ ఫాదర్ తో డాసింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ కలిశాడు. నేటి నుండి షూటింగ్‌ లో కూడా పాల్గొంటున్నాడు. చిరంజీవి తో సినిమా చేయాలన్న ఆయన కల నెరవేరిందంటూ పూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో చిరంజీవి ట్విట్టర్ లో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ ఒకటి పెట్టాడు. ఆయన పూరి గురించి ట్విట్టర్ లో... నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు వచ్చి వెండి తెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే ఇలా గాడ్ ఫాదర్ లో అవకాశం ఇచ్చాం అంటూ చిరంజీవి పేర్కొన్నాడు.

పూరి జగన్నాద్‌ కల అలాగే ఉండి పోకూడదు అనే ఉద్దేశ్యంతో చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇవ్వడం ను మెగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. చిరంజీవి గొప్ప వాడు.. చిరంజీవి మంచి మనసున్న వ్యక్తి అంటూ ఈతరం ప్రేక్షకులు వినడమే తప్ప చూసి ఉండరు. ఇలాంటివి ఆయన మంచి తనానికి నిదర్శనం అంటూ చిరంజీవి సీనియర్ అభిమానులు గొప్పగా చెబుతున్నారు.

చిరంజీవి 150వ సినిమా ను ఆటో జానీగా పూరి జగన్నాద్‌ తీయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్‌ అయ్యింది. కథ కూడా ఓకే అయ్యింది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా చిరంజీవి మరో సినిమా ను చేయడంతో పూరి నిరాశ వ్యక్తం చేశాడు. ఆ సమయంలో చిరంజీవి పై పూరికి కోపం వచ్చిందని కూడా పుకార్లు షికార్లు చేశాయి.

అప్పుడు కోపం తెప్పించినందుకు ఇప్పుడు పూరికి తన గాడ్‌ ఫాదర్ సినిమాలో కీలక పాత్రను ఇచ్చి ఆ కోపాన్ని కూల్‌ చేశాడా అంటూ కొందరు చిరంజీవి గురించి కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి వంటి స్టార్‌ కు పూరి కోపాన్ని కూల్‌ చేయాల్సిన అవసరం లేదు. కాని పూరి గతంలో నటుడు అవ్వాలనే ఆశతో ఉండేవాడు కనుక అతడికి ఈ చిన్న ఆఫర్ ఇస్తే అతడి డ్రీమ్‌ నెరవేరినట్లు అవుతుందని మెగాస్టార్‌ భావించి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం.

మొత్తానికి గాడ్‌ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ కనిపించబోతున్నాడు. అది ఏ పాత్ర.. ఎంత సమయం అనేది తెలియాల్సి ఉంది. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మలయాళం సూపర్ హిట్‌ మూవీ లూసీఫర్‌ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. నయనతార కీలక పాత్రలో కనిపించబోతుంది.