Begin typing your search above and press return to search.

పూరి.. ఈసారి కొట్టకపోతే కష్టం

By:  Tupaki Desk   |   10 March 2017 6:20 AM GMT
పూరి.. ఈసారి కొట్టకపోతే కష్టం
X
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ స్థాయిలో ఎత్తు పల్లాలు చూసిన వాళ్లు ఇంకెవరూ ఉండరేమో. ‘బద్రి’ లాంటి సూపర్ హిట్‌ తో దర్శకుడిగా పరిచయమైన పూరి.. ఆ వెంటనే ‘బాచి’తో బోల్తా కొట్టాడు. ఆపై ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ దగ్గర్నుంచి నెమ్మదిగా పుంజుకుని స్టార్ స్టేటస్ సంపాదించాడు. కానీ మళ్లీ మధ్యలో ఫ్లాపులతో ట్రాక్ తప్పాడు. అయినా స్థైర్యం కోల్పోలేదు. ‘పోకిరి’తో ఇండస్ట్రీని షేక్ చేసే హిట్టుతో మళ్లీ తనేంటో చాటుకున్నాడు. ఆ తర్వాత కూడా పడటం లేవడం పూరికి అలవాటైపోయింది. ఇప్పుడు పూరి కెరీర్లో ఎన్నడూ లేనంత స్లంప్ ఎందుర్కొంటున్నాడు. జ్యోతిలక్ష్మీ.. లోఫర్.. ఇజం లాంటి డిజాస్టర్లతో పూరి కెరీర్ బాగా దెబ్బ తినేసింది. ఇలాంటి టైంలో నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో పూరికి సినిమా చేసే అవకాశం దక్కడం పెద్ద షాకే.

పూరి బాలయ్యతో సినిమాను అనౌన్స్ చేశాక కూడా చాలామందికి దీనిపై నమ్మకం కుదర్లేదు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టమే అన్నట్లు సందేహాలు వ్యక్తం చేశారు. సినిమా సెట్స్ మీదికి వెళ్లేదాకా నమ్మకం లేదన్నారు. ఇందుకు పూరి ట్రాక్ రికార్డే ఒక కారణం. దీన్ని బట్టే పూరి ఎంతగా డౌన్ అయ్యాడో కూడా అర్థం చేసుకోవచ్చు. ఐతే ఈ చిత్ర ప్రారంభోత్సవంతో సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. ఇప్పుడిక పూరి తనేంటో రుజువు చేసుకోవాల్సిన సమయం రానే వచ్చింది. కెరీర్లో పూరి అత్యంత పట్టుదలతో పని చేయాల్సిన టైం ఇది. పూరి ట్రాక్ రికార్డు గురించి పట్టించుకోకుండా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి మెమొరబుల్ మూవీ తర్వాత బాలయ్య అతడికి అవకాశం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. బాలయ్య అతడిపై ఎంత నమ్మకం పెట్టాడో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే మాత్రం పూరి కెరీర్ కు మామూలు డ్యామేజ్ జరగదు. ఆ తర్వాత అతడితో పని చేయడానికి ఇంకే స్టార్ హీరో ముందుకు రాకపోవచ్చు. మరి పూరి.. బాలయ్య నమ్మకాన్ని ఏ మేరకు నిలబెడతాడో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/