Begin typing your search above and press return to search.

బాహుబలి చేయను.. వందిచ్చి చూస్తా

By:  Tupaki Desk   |   28 Sept 2015 9:07 AM IST
బాహుబలి చేయను.. వందిచ్చి చూస్తా
X
మెగా సోదరుడు నాగేంద్రబాబు కొడుకు వరుణ్‌ తేజ్‌ హీరోగా.. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్ లోఫర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి.. మూడు రోజుల టాకీపార్ట్ మినహా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయింది. సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్‌ పుట్టినరోజు సందర్భంగా.. స్పెషల్ ఇంటర్వ్యూ...

ప్ర.. లోఫర్‌ సంగతులేంటి ?
జ-. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయ్‌ తర్వాత మదర్ సెంటిమెంట్ తరహా తీసిన సినిమా ఇది. వరుణ్‌ తేజ్‌ తో మొదటిసారి పనిచేస్తున్నా... అతడు ఫ్యూచర్ స్టార్‌ అవుతాడని అర్ధమైంది నాకు. వరుణ్ స్టార్ అయ్యి నాగబాబు గర్వపడేలా చేస్తాడు. పొడవుగా ఉన్న ఈ మెగాహీరో ఫేస్ లో అంత అమాయకత్వం కనిపిస్తుంది. అదే అతడిని పెద్ద స్టార్‌ ని చేస్తుంది. ఈ సినిమాలో మాస్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. దిశా పటానీ కథానాయిక. తనుకూడా పెద్ద స్టార్‌ అవుతుందనే నమ్మకం నాకుంది. హీరో తల్లి పాత్రలో రేవతి - తండ్రిగా పోసాని నటించారు. అయితే అమ్మనాన్న తమిళమ్మాయికి - దీనికి సంబంధం ఉండదు.

-- ప్ర, కథ కోసం వరుణ్, వరుణ్ కోసం కథ.. ఇందులో ఏది నిజం ?
జ. నేను రాసుకున్న కథలో వరుణ్‌ తేజ్‌ నటించాడంతే. ముందే రాసుకున్న స్టోరీ ఇది. వరుణ్ లుక్ - అప్పీల్ నచ్చి హీరోగా తీసుకున్నా.

ప్ర. లోఫర్‌ టైటిల్‌ లో కరెక్టేనంటారా ?
జ. ఈ సినిమా స్టోరీకి లోఫర్ టైటిల్ ఒకటే సరిపోతుంది. సినిమా చూశాక అందరూ ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ముందు టైటిల్‌ మార్చాలని రాంగోపాల్ వర్మ, నిర్మాత సి.కళ్యాణ్‌ పట్టుబట్టినా.. ఇప్పుడు వాళ్లే యాక్సెప్ట్ చేశారు. అంతేకాదు. అమ్మ మీద ఓ ప్రోమోను వర్మ స్వయంగా కట్‌ చేశారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్‌. ఆయనకు లోఫర్ అంత బాగా నచ్చింది.

ప్ర, కొత్త ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు ?
జ. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడితో ఓ సినిమా చేస్తున్న మూవీకి.. నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభమవుతుంది. తెలుగు, కన్నడలో ద్విభాషా చిత్రంగా ఇది రూపుదిద్దుకోనుంది. అలాగే మహాత్మ నిర్మాత సి.ఆర్‌.మనోహర్‌ అన్న కొడుకు ఇషాంత్‌ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను.

ప్ర. మహేష్‌ తో సినిమా ఎప్పుడు చేస్తారు?
జ. మహేష్‌ మూవీకి స్క్రిప్టు రెడీ అయిపోయింది. అలాగే అల్లు అర్జున్‌ తో ఓ సినిమా చేస్తారు. అది కూడా స్క్రిప్టు రెడీగా ఉంది. నేను ఓ సినిమా చేస్తుండగానే మరో మూడు స్క్రిప్టులు రెడీగా ఉంటాయి. అదే పూరి వర్కింగ్ స్టయిల్‌.

ప్ర. ఆటోజానీ సగతేంటి.. ఉన్నట్లా ? లేనట్లా?
జ. చిరుకి కథ చెప్పాను. సెకండాఫ్ నచ్చలేదన్నారు. సగం కథ నచ్చిందని నాతో అన్నారు. రెండో సగం నచ్చలేదని మీడియాతో చెప్పారు. ఏం నచ్చలేదో చెబితే కరెక్షన్‌ చేసేవాడిని. కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీడియాకు చెప్పారాయన. చిరు కోసం నేను ఇప్పటికీ రెడీగానే ఉన్నా. సెకండాఫ్‌ లో ఏం నచ్చలేదో చెబితే దాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నా.

ప్ర. పూరి ప్రయాణం గురించి చెప్పండి ?
జ. పరిశ్రమకి వచ్చి 15 సంవత్సరాలైంది. 30 సినిమాలు తీశాను. ఖాళీ అయిపోతే ఎలా అనే టెన్షన్‌ ఎప్పుడూ ఉంటుంది. సినిమాలు తీయడమే నా పని. అదే నాకు మజానిస్తుంది.

ప్ర. 'ఫస్ట్ మూవీ బద్రికి సంబంధించి గ్రేట్ మూమెంట్ ఏమన్నా ఉందా?
జ. పవన్‌ కల్యాణ్‌ తో షూటింగ్ ఎలా తీస్తాడో అని అందరూ అనుకున్నారు. ప్యాకప్‌ చెప్పాక.. గురువు వర్మ నన్ను హత్తుకుని, నీ లైఫ్‌ లో 50 సినిమాలు తీస్తావ్‌ .. అని ఆశీర్వదించారు.

ప్ర. హీరోయిన్ల కేరక్టర్ల కోసం మీరు తీసుకున్న ప్రత్యేకమైన జాగ్రత్తలేంటి?
జ. ప్రతి సినిమాలో హీరోయిన్లకు క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఉంటుంది. బద్రి - ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం - అమ్మా నాన్న తమిళమ్మాయ్‌ లాంటి సినిమాల్లో హీరోయిన్‌ ని బాగా ప్రొజెక్ట్ చేశాను. వర్కింగ్‌ ఉమెన్‌ గానే చూపించడం నా స్టయిల్ మధ్యలో ఏయ్‌ - ఒసేయ్‌ లాంటి మాటలు అనడం వల్ల ఆడాళ్లంటే గౌరవం లేదని అనుకుంటారు కానీ.. అవన్నీ క్యారెక్టర్ల ప్రవర్తనకు అనుగుణంగా రాసిన డైలాగ్స్ మాత్రమే.

ప్ర, మళ్లీ హిందీలో సినిమా ఎప్పుడు తీస్తారు?
జ. బహుశా నెక్ట్స్ ఇయర్ స్టార్ట్ కావచ్చు.

ప్ర. బ్యాంకాక్‌ లోనే స్క్రిప్టులు రాస్తారు. అదేమన్నా సెంటిమెంటా?
జ. అది నా సెంటిమెంట్‌ కాదు నాకు కంఫర్ట్‌.

ప్ర. పెద్ద హీరో - చిన్న హీరోలతో కూడా పనిచేస్తారు. ఎలా సాధ్యం ?
జ. నేను మూవీ తీసే టైంకి ఎవరు ఖాళీగా ఉంటే వారితో చేసేస్తా. రెడీగా ఉన్న వాళ్లను తీసుకుని సినిమా ఫినిష్ చేయాలంతే. పెద్ద హీరోతోనే చేయాలనే సిద్ధాంతం లేదు నాకు. అలాంటివి పెట్టుకుంటే ఒళ్లు హూనం అవుతుంది. చిన్న హీరో అయినా, లేకపోతే కొత్తవారితోనైనా చేయడానికి నేను ఎప్పుడూ రెడీ.

ప్ర. మీ సినిమా టైటిల్స్ పై వచ్చే కామెంట్ లకు ఎలా స్పందిస్తారు?
జ. పోకిరి వల్ల దేశానికి వచ్చిన నష్టమేంటి? బ్యాడ్‌ ఏం వచ్చింది? పోకిరి టైటిల్‌ బ్యాడ్‌ అనిపించి ఉండొచ్చు. కానీ క్యారెక్టర్‌, కథకి యాప్ట్‌. బిజినెస్‌మేన్‌ టైటిల్‌ అందరికీ నచ్చింది. ఈ సినిమాని ఎంబిఎ కాలేజ్‌ లలో విద్యార్థులకు పాఠంగా చెబుతున్న విషయం గుర్తుంచుకోవాలి.

ప్ర. తల్లి సెంటిమెంట్‌ పై లోఫర్‌ లో పాట రాసినది ఎవరు?
జ. సుద్ధాల అశోక్‌ తేజ ఆ పాట రాశారు. కన్నీళ్లు పెట్టించే పాట అది. సునీల్‌ కశ్యప్‌ సంగీతం బాగా కుదిరింది.

ప్ర. లోఫర్‌ కి టైటిల్‌ కి మీరిచ్చే అర్ధం ఏంటి?
జ. హీరో ఓ దొంగ. చెడ్డవాడు మంచోడుగా మారతాడు. అంతే.

ప్ర. సీనియర్ డైరెక్టర్ గా ఔత్సాహిక దర్శకులకు మీరిచ్చే సలహా ఏంటి?
జ. జీవితం అందరి సరదా తీర్చేస్తుంది. అలాగే నేర్చుకుంటారంతా. ఎవరేం చెప్పినా ఎదుటివాళ్లకు నచ్చదు. సలహాలిస్తే ఎవరూ వినరు. ఇవన్నీ బైబిల్‌, భగవద్గీతలో ఉన్నవే. అందరికీ తెలిసినవే. అయినా ఎవరూ పాటించరు.

ప్ర. పుట్టినరోజున ఏమేం గుర్తు చేసుకోవాలి?
జ. ఓ చిన్న నాటకం రాస్తే నా చేతికి పాతిక వేలిచ్చి ఇండస్ట్రీకి వెళ్లమన్నారు. సినిమా అంటే.. ఏ తల్లిదండ్రులు ప్రోత్సహించరు. కానీ మా వాళ్లు ఎంకరేజ్ చేశారు.

ప్ర, షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పిస్తే అవకాశాలిస్తామని చెప్పారు గతంలో ?
జ. దర్శకుడు, నిర్మాత.. ఎవరైనా సరే హీరోకి కథ చెప్పి ఒప్పించాలి, మెప్పించాలి. పోకిరి తీశానని మహేష్‌ - టెంపర్‌ తీశానని ఎన్టీఆర్‌ నాకు డేట్స్‌ ఇవ్వరు. 100 సినిమాలు తీసినా, ఒక్క సినిమానే తీసినా కథ చెప్పి ఒప్పించుకోవాల్సిందే. కొత్త డైరెక్టర్లు అలాగే రావాలి. ఎదగాలి.

ప్ర. మీ సినిమాల్లో మీకు నచ్చినవి?
జ. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం - అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి - నేనింతే - బిజినెస్‌ మేన్‌ .. ఇప్పుడు లోఫర్‌.

ప్ర. బాహుబలి లాంటి సినిమా చేసే ఆలోచన ఉందా?
జ. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమా చూస్తానంతే. రెండు నెలల తర్వాత అదే స్క్రిప్టు వింటే నాకు బోర్ కొడుతుంది. అలాంటివి చూడాలంతే.. చేయకూడదు.

ప్ర. దర్శకులపై ఒత్తిడి పెరిగిందన్న కామెంట్స్ పై మీరేమంటారు?
జ. హిట్టొచ్చినప్పుడు ఇండస్ట్రీ బలం పెరుగుతుంది. బాహుబలి - శ్రీమంతుడు హిట్‌ వచ్చిన తర్వాత మరింత స్థాయి పెరిగింది. మున్ముందు మరింత పెరుగుతుంది.

ప్ర. చిన్న సినిమాలు చేస్తానన్నారు, ఎప్పుడు ?
జ. కొంతకాలంగా శాటిలైట్‌ బాలేదు. చిన్న సినిమాలు ఆగిపోతున్నాయ్‌. పరిశ్రమ బాలేదు. అందుకే తీయలేదు.