Begin typing your search above and press return to search.

పూరి ఎన్ని సినిమాలు చేస్తాడింత‌కీ?

By:  Tupaki Desk   |   11 May 2016 11:06 AM IST
పూరి ఎన్ని సినిమాలు చేస్తాడింత‌కీ?
X
మూడు నెల‌ల్లో సినిమాని పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే కెపాసిటీ పూరి జ‌గ‌న్నాథ్‌ ది. సినిమా మేకింగ్‌ లో ఆయ‌న‌ది ఎక్స్‌ ప్రెస్ వేగం అని చెప్పొచ్చు. కానీ రోగ్ అంటూ ఓ సినిమాని మొద‌లుపెట్టి నెల‌లు గ‌డుస్తున్నా చ‌డీచ‌ప్పుడు లేదు. ఇంత‌కీ ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతుందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి. అంత‌లో క‌ళ్యాణ్‌ రామ్ సినిమాని మొద‌లుపెట్టాడు. ఇలా రెండు సినిమాలు సెట్స్‌ పై ఉన్నా కూడా పూరి కొత్త సినిమాల ప్ర‌క‌ట‌న‌లు మాత్రం ఒక దాని వెంట ఒక‌టి వ‌చ్చేస్తున్నాయి. అవి చూసి ఇంత‌కీ పూరి ఎన్ని సినిమాలు చేస్తాడ్రా బాబోయ్ అంటూ మాట్లాడుకుంటున్నారు జ‌నాలు. అయితే పూరి మాత్రం ఆ సినిమాల‌న్నింటిపైనా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉన్నాడ‌ని తెలుస్తోంది.

మొద‌ట మ‌హేష్‌ తో జ‌న‌గ‌ణ మ‌న చిత్రాన్ని ప్ర‌క‌టించాడు పూరి. ఆ త‌ర్వాత వెంక‌టేష్ 75వ సినిమా అంటూ కొత్త క‌బురు బ‌య‌టికొచ్చింది. నిజంగానే పూరి - వెంకీ క‌లిసి ఆ సినిమా గురించి చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. ఆ రెండు సినిమాల గురించి చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే పూరి కాంపౌండ్ నుంచి మ‌రో క‌బురు బ‌య‌టికొచ్చింది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా పూరి ఓ చిత్రాన్ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌న్న‌దే ఆ క‌బురు. మ‌హేష్‌ - వెంకీల సినిమాలకి సంబంధించే ఇంకా ఎలాంటి పురోగ‌తి లేదు.

అప్పుడే ఎన్టీఆర్‌ కోసం పూరి క‌థ సిద్ధం చేశాడా? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు ప‌రిశ్ర‌మ జ‌నాలు. కానీ పూరి జ‌గ‌న్నాథ్ `నేతాజీ` పేరుతో ఎన్టీఆర్ కోసం కూడా ఓ క‌థ‌ని సిద్ధం చేశాడ‌ని, ఎన్టీఆర్ పుట్టిన‌రోజున ఆ సినిమాని ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాల‌న్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే పూరికి తిరుగుండ‌దంతే. మ‌హేష్‌ - వెంకటేష్‌ - ఎన్టీఆర్‌ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో సినిమాలంటే ఆ హంగామానే వేరుగా ఉంటుంది మ‌రి!