Begin typing your search above and press return to search.

11 గంటల పాటు సాగిన ఈడీ విచారణలో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   1 Sep 2021 4:17 AM GMT
11 గంటల పాటు సాగిన ఈడీ విచారణలో ఏం జరిగింది?
X
తప్పు ఎప్పుడు జరిగినా.. జరగకున్నా.. జరిగిందన్న సందేహం అధికారులకు వస్తే.. అదెంతలా వెంటాడుతుందన్న దానికి నిదర్శనంగా తాజాగా మళ్లీ తెర మీదకు వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ ఉదంతంగా చెప్పాలి. కొన్నేళ్ల క్రితం జోరుగా సాగిన ఈ కేసు విచారణ తర్వాత ఏమీ పట్టనట్లుగా పక్కన పెట్టేయటం తెలిసిందే. ఇంతకాలానికి గాఢనిద్ర నుంచి ఉలిక్కిపడి లేచినట్లుగా ఈడీ పన్నెండు మందికినోటీసులు ఇవ్వటం.. అందులో సినీ ప్రముఖులే ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చింది. చర్చ మొదలైంది.

ఈడీ జారీ చేసిన నోటీసుల్లో మొదటగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. వీరి విచారణ ఏకంగా పదకొండు గంటల పాటు సాగటం గమనార్హం. మంగళవారం ఉదయం 10.12 గంటలకు ఈడీ కార్యాలయానికి పూరీ జగన్నాధ్ చేరుకోగా.. ఆయన్ను రాత్రి 8.45 గంటల వరకు అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మధ్యలో భోజన విరామం కాసేపు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

మరి.. ఈ పదకొండు గంటల్లో ఏం జరిగింది? అన్న విషయంలోక వెళితే.. పూరీ తనతో పాటు తనకుమారుడు ఆకాశ్ ను.. చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీధర్ ను వెంట పెట్టుకొని వచ్చారు. 2017లో ఎక్సైజ్ ఎన్ ఫోర్సుమెంట్ అధికారుల దర్యాప్తులో టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెరపైకి రావటం తెలిసిందే. అంతకు ముందు రెండేళ్లకు సంబంధించి ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నట్లు చెబుతున్నారు.

గతంలో జరిగిన విచారణలో పలువురు విదేశీయులు (కెల్విన్.. మైక్ కమింగా.. రాన్సన్ జోసెఫ్.. అలెక్స్ విక్టర్.. అబూ బాబర్ తదితరులు) విదేశాల నుంచి డ్రగ్స్ ను తెప్పించినట్లుగా తేలటం తెలిసిందే. వారి నుంచి ఎవరు కొనుగోలు చేశారు? డబ్బు ఎలా చెల్లించారు? విదేశాలకు చెల్లింపులు జరిగాయా? లాంటి వాటిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు చెబుతున్నారు. పూరీని.. ఆయన చార్టెర్డ్ అకౌంటెంట్ ను వేర్వేరుగా విచారించి వివరాలు రాబట్టినట్లుగా చెబుతున్నారు.

ఆఫ్రికా దేశాలకు నగదు ఎందుకు పంపారు? ఆఫ్రికన్ల బ్యాంకు ఖాతాల్లోకి నగదు పంపటానికి కారణం ఏమిటి? మీ బ్యాంకు ఖాతాల్లో ఈ అనుమానాస్పద లావాదేవీల వివరాలేంటి? లాంటి ప్రశ్నలు మాత్రమే కాదు.. ముగ్గురు ఆఫ్రికా డ్రగ్ పెడలర్ల ఫోటోలను ఈడీ అధికారులు పూరీ జగన్నాధ్ కు చూపించినట్లు తెలుస్తోంది. ‘వీళ్లు ఎవరో తెలుసా? ఎప్పుడైనా చూశారా?’ అని ప్రశ్నించగా.. తనకు తెలియదని పూరీ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

2017 జులైలో డ్రగ్ పెడలర్ కెల్విన్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. అనంతరం అరెస్టు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా అతని ఫోన్లో పలువురు సినీ సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు.. వాట్సాప్ చాట్ ను గుర్తించారు. దీంతో.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతని నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. వాట్సాప్ చాట్ ఆధారంగానే సినీ రంగానికి చెందిన 12 మందిని పిలిపించి విచారణ జరిపారు.

బ్యాంకు లావాదేవీల స్టేట్ మెంట్లను వెంట తెచ్చిన పూరీ జగన్నాథ్ వాటిని అధికారులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వివిధ కేసుల్లో నిందితులు చెప్పిన వివరాల్ని.. పూరీ బ్యాంకు ఖాతాలు.. ఆయన చెప్పిన వివరాల్ని బ్యాంకు స్టేట్ మెంట్లలో క్రాస్ చెక్ చేసినట్లు సమాచారం. విదేశాల్లో సినిమా షూటింగ్ జరిగినప్పుడు అక్కడ చోటు చేసుకున్న లావాదేవీలపై ఆరా తీసినట్లు చెబుతున్నారు.

వాస్తవానికి పూరీ బ్యాంకు ఖాతాల వివరాల్ని తీసుకురావటానికి ముందే.. ఈడీ అధికారులు వాటిని పరిశీలించినట్లుగా సమాచారం. పూరీ బ్యాంకు ఖాతా నుంచి విదేశాలకు రెండు లావాదేవీల్లో భారీగా నగదు బదిలీ కావటాన్ని ఈడీ గుర్తించింది. ఇద్దరు ఆఫ్రికన్ల ఖాతాల్లోకి బదిలీ చేసిన నగదు ఆధారాల్ని సమర్పించి.. వాటి వివరాలు కోరినట్లుగా తెలుస్తోంది. పదకొండు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం విచారణ పూర్తి అయ్యిందని.. మళ్లీ పిలిచే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. తాము పిలిచినప్పుడు మళ్లీ రావాలని పూరీకి అధికారులు చెప్పి పంపినట్లుగా తెలుస్తోంది.