Begin typing your search above and press return to search.

భావోద్వేగానికి గురిచేస్తున్న 'నాన్న' గురించి పూరీ చెప్పిన మాటలు..!

By:  Tupaki Desk   |   3 Nov 2020 7:50 AM GMT
భావోద్వేగానికి గురిచేస్తున్న నాన్న గురించి పూరీ చెప్పిన మాటలు..!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తన ఐడియాలజీని పోడ్ కాస్ట్ రూపంలో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'డాడ్'(నాన్న) అనే టాపిక్ మీద మాట్లాడారు. పూరీ 'నాన్న' గురించి మాట్లాడుతూ.. "నాన్న.. ఆల్వేస్ అండర్ రేటెడ్. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. ఎందుకంటే నాన్న ఎవరికీ చెప్పుకోడు. పిల్లలకి, పెళ్లానికి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేయడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు. ఎప్పుడో వెళతాడు. బిజీగా ఉన్న నాన్న అయితే రాత్రిపూట ఇంటికొచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు. 'ఎప్పుడూ పనేనా కాస్త ఇంటి పట్టున ఉండొచ్చు కదా' అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటూ ఉంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్ళై పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతిలో ఉండదు. మనందరి కోసం నాన్న రాత్రి పగలు పనిచేయాలి. చదువు - సమస్యలు - చుట్టాలు పండగలు - హాస్పిటల్స్‌ - బర్త్‌ డేలు వీటన్నింటితో నాన్న నలిగిపోతాడు'' అని చెప్పాడు.

''యాంగ్జైటీ, షుగర్‌, పెరాలసిస్‌, హార్ట్‌ ఎటాక్‌ ఇలా ఎన్నో వస్తుంటాయి నాన్నకి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. నిజానికి నాన్నకు వృద్ధాప్యం రాలేదు. మీకోసం అనుక్షణం కరిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆ రిపోర్ట్‌ లు తీసుకుని ఇంటికి రాడు. తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసైనా చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి స్కూల్‌ లో పిల్లల సీటు కోసం లైన్‌ లో నిల్చుంటాడు. మీరు ఎగ్జామ్ రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో అయిపోతారనే ఆశ. ఆస్తులు అమ్మైనా కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ ఎక్కడ ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు''

''కొన్ని వందలసార్లు వేలసార్లు అమ్మ ఏడ్వడం చూస్తాం కానీ.. నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా?. నాన్న కూడా ఏడుస్తాడు. కానీ మీ ముందు ఏడవడం నాన్నకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు. పిల్లలు పెద్దవాళ్ళై ఏదో పని చేసుకునే టైంకి.. అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు నాన్న. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురుచెప్పడం మొదలుపెడతారు. 'ఇన్నాళ్లూ నేను ఎవరి కోసం బతికాను? నా కోసం నేను ఏదీ దాచుకోలేదే?' అని అప్పుడు నాన్నకు ఆలోచన వస్తుంది. 'నేను' అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పాడుచేసాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక టైంలో నాన్నను ఏడిపిస్తాడు. నాన్న గుండెల మీద తంతాడు. అప్పటికి ఏడవడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి''

''కొడుకు ఎంత మంచివాడు, ప్రయోజకుడైతే తండ్రిని అంత బాధ పెడతాడు. వాడికి ఎంత సక్సెస్‌ వస్తే అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు. ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌ డే వస్తే, కిడ్స్ ని ఇన్వైట్ చేస్తాం. కానీ మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ నాన్న బర్త్‌ డే కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ ఫ్యూచర్ గా ఫీల్‌ అవుతారు. నాన్న మీ ఫ్యూచర్ కాదు. కానీ నాన్నకు మీరే ఫ్యూచర్. మీ కోసమే రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ ను నాశనం చేసుకున్నాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ నీరుగారి పోయింది. మీ మూలంగానే మీ నాన్నలోని కాన్ఫిడెన్స్ మాయమైపోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో ఆర్డినరీగా మిగిలిపోయారు. మీవల్లే. రెస్పెక్ట్ యువర్ డాడ్'' అని పూరీ ఎమోషనల్ అయ్యేలా నాన్న గురించి చెప్పుకొచ్చాడు.