Begin typing your search above and press return to search.

దుమారం రేపుతున్న పూరి 'సందేశం'

By:  Tupaki Desk   |   28 Aug 2020 1:30 AM GMT
దుమారం రేపుతున్న పూరి సందేశం
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్య సినిమా సంబంధిత విషయాలతో కాకుండా పాడ్‌కాస్ట్ సందేశాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో ఆయన పాడ్ కాస్ట్‌లో ఇస్తున్న ఆడియో సందేశాలు సూపర్ పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఐతే సినిమాల్లో మాదిరే ఇక్కడ కూడా ఆయన అభిప్రాయాలు రాడికల్‌గా, రెవల్యూషనల్‌గా ఉండటంతో కొన్ని వివాదాలు తప్పట్లేదు. ఇటీవల ఆయన దేశంలో పేదరికం, కులం లాంటి సెన్సిటివ్ అంశాలపై ఇలాగే మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. వాస్తవ రూపం దాల్చలేని పరిష్కారాలతో వివాదానికి తెరతీశారు. ఇంతకీ పూరి ఈ ఆడియో సందేశాల్లో ఏమన్నారో క్లుప్తంగా చూద్దాం.

‘‘మన దేశంలో చాలామందికి ఉచిత పథకాలు తీసుకుని పేదోడిగా బతకడం అలవాటైంది. ఐతే ఇలాంటి వాటిలో మార్పులు రావాలి. రేషన్ కార్డు ఉన్నవారికి ఓటు హక్కు రద్దు చేయాలి. అప్పుడు ఏది అవసరమో ఆలోచించుకుని.. నిజంగా కష్టాల్లో ఉన్నవాడే కార్డు తీసుకుంటాడు. ఓటు హక్కు కావాలనుకున్నవాడు జీవితంలో ఇంకా ఎక్కువ కష్టపడుతాడు. ఓటు లేకపోతే సారా ప్యాకెట్లు లేవు. సారా ప్యాకెట్‌తో ఎన్నికలను డిసైడ్ చేసే బ్యాచ్ ఎన్నికలకు ముందే కట్ అయిపోతుంది. ఇక పేద విద్యార్థులకు ఉన్నత విద్య కావాలంటే రుణమిచ్చి తిరిగి చెల్లించమనాలి. ఉద్యోగం చేసి అప్పు తీర్చాలి. అది అప్పు అని తెలిస్తేనే విద్యార్థులు ఒళ్లు దగ్గర పెట్టుకుని చదువుతారు. రిజర్వేషన్లు కులాలను బట్టి గాక పేదవాడు ఏ కులంలో ఉన్నా సపోర్ట్ చేయాలి. నిరక్షరాస్యులకు ఓటు హక్కు ఉండకూడదు. కనీస విద్యార్హత మెట్రిక్యులేషన్‌గా నిర్ణయించాలి. అలా అయితేనే ప్రపంచాన్ని,నాయకులను అడుక్కోవడం మానేస్తాం. ప్రపంచంలో ఏ జంతువు మరో జంతువు ముందు చేయి చాచదు. తిండి కోసం కష్టపడుతుంది లేదా చస్తుంది. నీ జాతిని కించపరిస్తే నీకు కోపమొస్తుంది కదా... అలాంటప్పుడు అదే జాతిని కించపరుస్తూ ప్రభుత్వం ముందు పేదోడిలా నిలుచోవడం తప్పు కదా’’ ఇవీ పూరి పంచుకున్న కొన్ని అభిప్రాయాలు. చివర్లో ఒక బూతు మాట కూడా వాడిన పూరి.. దమ్ము లేని వాడే పేదోడిగా మిగిలిపోతాడని తేల్చేశాడు.

ఐతే దీనిపై పలువురు మేధావులు, రచయితలు, ప్రజాసంఘాల నాయకులు పూరి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. పూరీకి సమాజం గురించి, పేదరికం, కులం లాంటి అంశాలపై లోతైన అవగాహన లేదని అంటున్నారు. కులాన్ని బాగా వాడుకుని ఎదిగినవాళ్లే ఇతరులను వేస్టు గాళ్లని నిందిస్తారని. చదువుకున్న వాళ్లకే ఓటు హక్కు ఉండాలని గాంధీ కూడా అన్నారని.. అయితే కేవలం మూడు కులాలకే చదువుకునే హక్కునిచ్చి... ఇతర కులాలకు చదువుకునే హక్కు లేకుండా చేసి... వాళ్లందరినీ నిరక్షరాస్యులను చేసిన వాళ్లదా తప్పు... నిరక్షరాస్యులదా.. అసలు వేల ఏళ్లుగా చదువుకున్న వాళ్ల వల్ల దేశం ఏం బాగుపడింది అంటూ అంబేద్కర్ అడిగిన ప్రశ్నకు గాంధీ కూడా సమాధానం చెప్పలేకపోయారని ఓ సంఘం నాయకుడు పూరిని ప్రశ్నించాడు. ఇలా పలువురు పూరి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు.