Begin typing your search above and press return to search.

ఏకంగా పూరినే బెదిరించారు

By:  Tupaki Desk   |   8 Jun 2019 10:33 AM IST
ఏకంగా పూరినే బెదిరించారు
X
సాంకేతికత పెరిగే కొద్దీ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు ఒకవైపు మంచికే అనుకుంటున్నా దానికి రెండో వైపున ఉన్న చీకటి కోణం దర్శక నిర్మాతలకు పెను సవాల్ గా మారింది . దీని పుణ్యమా అని రోజుల్లో బయటికి రావాల్సిన పైరసీ ఇప్పుడు గంటల్లోకి నిముషాలలోకి మారిపోయి ఏకంగా థియేటర్ లో లైవ్ వీడియోలు పెట్టడం దాకా వచ్చింది. ఇదే పెను గండంగా మారింది అనుకుంటే ఇప్పుడు మరోతరహ పైరసీ రూపం దర్శకులను టెన్షన్ పెడుతోంది.

విషయానికి వస్తే పూరి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ వచ్చే నెల విడుదలకు రెడీ అవుతోంది. ఫైనల్ స్టేజి లో ఉండగా పూరికి లేనిపోనీ తలనెప్పి వచ్చి పడింది. హైదరాబాద్ కు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తన నిర్వహణలో ఉన్న ఇన్స్ టాగ్రామ్ పేజీలో ఐస్మార్ట్ శంకర్ పూర్తి స్క్రిప్ట్ పెట్టేస్తానని పూరికి బెదిరింపు పంపాడు. దీంతో అలెర్ట్ అయిన పూరి టీం వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు నిన్న రిపోర్ట్ చేసింది. సదరు వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

అయితే నిందితుడు తాను వేరే సైట్ నుంచి ఆ స్క్రిప్ట్ తీసుకున్నానని డబ్బులు డిమాండ్ చేయలేదని బుకాయించడం గమనార్హం. దీని గురించి లోతైన విచారణ జరుగుతోంది. సినిమా ప్రింట్లు బయటకు రాకుండా జాగ్రత్త పడటమే తలకు మించిన భారంగా పరిణమిస్తున్న తరుణంలో ఇలా స్క్రిప్ట్ లు కూడా లీకుల బారిన పడుతుంటే ఇక నిర్మాతల పరిస్థితి గురించి చెప్పేదేముంది. నిజంగా ఐస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ లీక్ అయ్యిందా లేదా సదరు పేజీ అడ్మిన్ పబ్లిసిటీ కోసం ఇదంతా చేశాడా అనే యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది