Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాదర్' విషయంలో పూరి జోక్యం?

By:  Tupaki Desk   |   3 Oct 2021 8:30 AM GMT
గాడ్ ఫాదర్ విషయంలో పూరి జోక్యం?
X
చిరంజీవి ఇప్పుడు వరుసగా భారీ సినిమాలను సెట్ చేసుకున్నారు. ఒక సినిమా తరువాత ఒకటిగా ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. అందుకు కావలసిన కసరత్తులు .. సన్నాహాలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాను పూర్తిచేసిన చిరంజీవి, పెద్దగా గ్యాప్ లేకుండా 'గాడ్ ఫాదర్' సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లారు. మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన 'లూసిఫర్' కి ఇది రీమేక్. ఈ కథను .. పాత్రను చిరంజీవి ఎంతగానో ఇష్టపడటం వలన, ఈ ప్రాజెక్టు కార్యరూపాన్ని ధరించింది. ఇటీవలే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును మొదలు పెట్టింది.

ఈ సినిమాకి తమిళ దర్శకుడు మోహన్ రాజాను తీసుకున్నారు. తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేసి రంగంలోకి దిగారు. అయితే స్క్రిప్ట్ కి సంబంధించిన ఈ మార్పులలో పూరి హ్యాండ్ కూడా ఉందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. 'లూసిఫర్' కథ .. ఆ సినిమాలో మోహన్ లాల్ పాత్రను డిజైన్ చేసిన తీరు పూరికి బాగా నచ్చాయట. ఆ విషయాన్నే ఒక సందర్భంలో చిరంజీవితో చెప్పాడట. అంతేకాకుండా ఆ కథలో చిరంజీవిని ఎలా చూపిస్తే బావుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. చిరంజీవికి గల క్రేజ్ కి తగినట్టుగా కొన్ని సీన్స్ ను తెరపై ఎలా ఆవిష్కరిస్తే బాగుంటుందనేది కూడా చెప్పాడు.

అప్పటికే 'గాడ్ ఫాదర్' స్క్రిప్ట్ కి సంబంధించిన వర్క్ చాలావరకూ పూర్తయింది. అయినా పూరి ఇచ్చిన సలహాలు .. సూచనలు తనకి నచ్చడంతో చిరంజీవి అలాగే మార్పులు చేయించారని అంటున్నారు. అలా 'గాడ్ ఫాదర్' సినిమాలో పూరి జోక్యం ఉందని చెప్పుకుంటున్నారు. సాధారణంగా చిరంజీవి ఒక సినిమా చేయాలనుకుంటే, కథ విషయంలో చివరివరకూ బెటర్మెంట్ ఉండేలా చూసుకుంటారు. ఇప్పటికీ ఆయన కొన్ని కథలపై పరుచూరి బ్రదర్స్ సలహాలు .. సూచనలు తీసుకుంటూ ఉంటారు. కథ మంచిగా రావడం కోసం అనుభవం ఉన్నవారు చెప్పిన విషయాలను తప్పకుండా ఆయన పరిగణనలోకి తీసుకుంటారు.

నిజానికి చిరంజీవి 150వ సినిమాను పూరి చేయవలసింది. 'ఆటో జానీ' టైటిల్ తో ఒక మాస్ కథను ఆయన అప్పట్లో చిరంజీవికి వినిపించారు. ఫస్టాఫ్ ను మించిన ఇంట్రెస్ట్ సెకండాఫ్ లో కలగకపోవడం అనే కారణంగా చిరంజీవి ఆ సినిమా చేయలేకపోయారు. అయితే ఎప్పటికైనా తాను చిరంజీవితో ఒక సినిమా చేసి తీరుతానని పూరి అన్నాడు. అలాంటి అవకాశం కోసం .. ఆయన నుంచి పిలుపు కోసం పూరి ఎదురు చూస్తున్నాడు. అయితే చిరంజీవి ఇటీవల బాబీ .. మెహర్ రమేశ్ వంటివారికి అవకాశాలు ఇచ్చారు. హరీశ్ శంకర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తన వైపు నుంచి ఆయనను ఒప్పించేందుకు పూరి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. పైగా గతంలో మాదిరిగా ఒక సినిమాను సాధ్యమైనంత త్వరగా తీసేయాలనే హడావుడిని పూరి ఇప్పుడు చూపించడం లేదు. లేదంటే 'లైగర్' ప్రేక్షకుల ముందుకు వచ్చి కూడా చాలా రోజులయ్యేది. పూరి సరిగ్గా దృష్టి పెడితే ఏ రేంజ్ హిట్ ఇవ్వగలడనేది చిరంజీవికి తెలుసు. తెరపై ఎలాంటి విన్యాసాలు చేయించగలడనేది తెలుసు. ఆ నమ్మకంతోనే ఆయన చరణ్ ఫస్టు మూవీని ఆయన చేతిలో పెట్టారు. ఆ నమ్మకం పూరిపై ఆయనకి ఇప్పటికీ అలాగే ఉంది. అందువలన సరైన కథ పడితే ఆయనకి చిరంజీవికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రస్తుతం 'గాడ్ ఫాదర్;' చేస్తున్న చిరంజీవి, ఆ తరువాత మెగర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' .. 'బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీర్రాజు' సినిమాలు చేయనున్నారు. ఏ రెండు ప్రాజెక్టులతో వచ్చే ఏడాది గడిచిపోతుంది. ఇక పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఏ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రాజెక్టు ఏదైనా సెట్ అవుతుందేమో చూడాలి.