Begin typing your search above and press return to search.

పునీత్ కు టాలీవుడ్ తో విడదీయలేని అనుబంధం..!

By:  Tupaki Desk   |   29 Oct 2021 11:30 AM GMT
పునీత్ కు టాలీవుడ్ తో విడదీయలేని అనుబంధం..!
X
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో శాండిల్ వుడ్ తోపాటు యావత్ సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ కూడా పునీత్ మృతి వార్త విని దిగ్భ్రాంతికి గురైంది. ఎందుకంటే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తో తెలుగు సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా హీరోగా లాంచ్ అయ్యారు పునీత్ రాజ్ కుమార్. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్.. పూరి దర్శకత్వంలో వచ్చిన ''అప్పు'' సినిమాతో హీరో అయ్యారు. అప్పటి నుంచి అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అప్పు సినిమా తెలుగులో 'ఇడియట్' పేరుతో రీమేక్ కాబడి ఘనవిజయం సాధించింది.

జూనియర్ ఎన్టీఆర్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆంధ్రావాలా' చిత్రాన్ని కన్నడలో 'వీర కన్నడిగ' పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు పునీత్. దీనికి తెలుగు వారైన మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అలానే మహేష్ బాబు - గుణశేఖర్ కలయికలో వచ్చిన 'ఒక్కడు' సినిమాని 'అజయ్' పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. ఈ చిత్రాన్ని కూడా మెహర్ రమేష్ తెరకెక్కించడం గమనార్హం.

రవితేజ - పూరీ జగన్నాధ్ కాంబోలో వచ్చిన 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాని కన్నడలో పునీత్ 'మౌర్య' గా రీమేక్ చేశారు. అలానే మహేష్ బాబు - శ్రీను వైట్ల కలయికలో రూపొందిన 'దూకుడు' మూవీ రీమేక్ లో కూడా పవర్ స్టార్ నటించారు. 'పవర్' పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ పై తెలుగు నిర్మాతలు రామ్ ఆచంట - గోపీ ఆచంట - అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

అపజయం లేకుండా సినిమా కెరీర్ సాగించిన అప్పు పునీత్ రాజ్ కుమార్ కు ఈ విధంగా తెలుగు సినిమాతో విడదీయ లేని బంధం ఉంది. టాలీవుడ్ ప్రముఖులతో ఆయన మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తనను పవర్ స్టార్ అని పిలవొద్దని.. అది పవన్ కళ్యాణ్ కు మాత్రమే వర్తిస్తుందని చెప్పడం ఆయన స్వభావాన్ని తెలియస్తుంది. 'పవర్' ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్టుగా హాజరైన మహేష్ బాబుతో మంచి అనుబంధం ఉంది. అలానే పునీత్ నటించిన 'చక్రవ్యూహ' సినిమా కోసం థమన్ సారథ్యంలో ఎన్టీఆర్ 'గెలయా' అనే సాంగ్ పాడి అలరించారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని పునీత్ చెబుతుంటారు.

ఇక చివరగా పునీత్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'యువరత్న' సినిమా కన్నడతో పాటుగా తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'జేమ్స్' 'ద్విత్వ' చిత్రాలను కూడా తెలుగులో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించకుండానే పునీత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీ స్టార్ హీరోని కోల్పోవడం బాధాకరం.

పునీత్ రాజ్ కుమార్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు అని టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు. చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - మహేష్ బాబు - ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - రానా దగ్గుబాటి - రామ్ పొతినేని - మంచు మనోజ్ - ప్రకాష్ రాజ్ - అడవి శేష్ - బొమ్మరిల్లు సిద్దార్థ్ - పూజా హెగ్డే - నివేదా థామస్ - మంచు లక్ష్మి - మెహర్ రమేష్ - రోజా - అనిల్ రావిపూడి - సూర్యదేవర నాగవంశీ వంటి ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.