Begin typing your search above and press return to search.

శంషాబాద్ లో పూణే త‌ర‌హా ఫిలిం ఇనిస్టిట్యూట్

By:  Tupaki Desk   |   5 Feb 2020 9:50 AM IST
శంషాబాద్ లో పూణే త‌ర‌హా ఫిలిం ఇనిస్టిట్యూట్
X
హైద‌రాబాద్ ఫిలింహ‌బ్ పై కేసీఆర్ ప్ర‌భుత్వంలో క‌ద‌లిక వ‌చ్చిందా? అంటే అవున‌నే తాజా స‌మాచారం. ఆ మేర‌కు సినీ పెద్ద‌లు మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున స‌హా ప‌లువురి తో తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ భేటీ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ భేటీలో ప్ర‌ధానంగా సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి గురించి మంత‌నాలు సాగించారు. ఇన్నాళ్లు పాల‌నా ప‌ర‌మైన అంశాల పైనే కేసీఆర్ దృష్టి సారించారు. మొన్న‌టితో ఎల‌క్ష‌న్ స్టంట్ అయిపోయింది కాబ‌ట్టి ఇక‌పై సినీహ‌బ్ పైనా సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి లో దృష్టి పెట్ట‌నున్నార‌ని త‌ల‌సాని సినీ పెద్ద‌ల‌కు వివ‌రించార‌ని తెలిసింది.

ఇక ఈ భేటీలోనే హైద‌రాబాద్ శంషాబాద్ ప‌రిస‌రాల్లో.. పూణే త‌ర‌హా ఫిలిం ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి తెరాస ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌ని.. త‌దుప‌రి ఏం చేయాలో చెప్పాల్సిందిగా చిరు-నాగార్జున‌ల‌ను అడిగార‌ని తెలుస్తోంది. అంతేకాదు చిత్ర‌పురి కాల‌నీ ప‌రిస‌రాల్లోనే మ‌రో ప‌దెక‌రాల స్థ‌లాన్ని సినీప‌రిశ్ర‌మ కార్మికుల కోసం కేటాయించనున్నామ‌ని త‌ల‌సాని వెల్ల‌డించారు. హైద‌రాబాద్ ఫిలింహ‌బ్ ని అభివృద్ధి చేయాల‌న్న స్ప‌ష్ఠ‌మైన హామీ ఉంద‌ని..అయినా ఇన్నాళ్లు సినిమా వాళ్ల‌ను ప‌ట్టించుకోని మాట నిజ‌మేన‌ని కూడా త‌ల‌సాని అంగీక‌రించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లో ఉన్న చిరంజీవి నివాసంలో జ‌రిగిన ఈ భేటీలో త్వ‌ర‌లోనే సినీపెద్ద‌ల్ని మ‌రోసారి క‌లుస్తామ‌ని త‌ల‌సాని తెలిపారు.

ఈ నిర్ణ‌యం తెలిపేందుకే ప్రత్యేకించి కేసీఆర్ తలసానిని సినీపెద్ద‌ల‌ వద్దకు పంపించారన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. గతం లో చిరు కూడా.. తెలుగు చిత్రపరిశ్రమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డి సైతం సిద్దంగా ఉన్నారని తెలిపారు. జనవరి 2న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో దీనిపై స్ప‌ష్టంగా చిరు వివ‌రించారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్ని క్లీన్ స్వీప్ చేసిన తెరాస ప్ర‌భుత్వం ఇదే ఉత్సాహం లో సినిమా వాళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌ని లో ఉండ‌డం స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది.