Begin typing your search above and press return to search.

విజయ్ రేంజే మారిపోయినట్లుందే

By:  Tupaki Desk   |   16 Sep 2015 11:30 AM GMT
విజయ్ రేంజే మారిపోయినట్లుందే
X
తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు తమిళ సూపర్ స్టార్ విజయ్. కానీ అతడి సినిమాల్ని తెలుగోళ్లు పట్టించుకోలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా సినిమాలు వదులుతూ వచ్చాడు. స్నేహితుడు, తుపాకి సినిమాలు ఓ మోస్తరుగా అతడికి మార్కెట్ తెచ్చిపెట్టాయి. ఈ మధ్య ‘జిల్లా’ అనే మసాలా మూవీ ఒకటి తెలుగులో రిలీజై మంచి విజయం సాధించింది. తొలిసారి విజయ్ సినిమాకు లాభాలు వచ్చింది ఈ సినిమాకే. దీంతో ఒక్కసారిగా అతడి రేంజే మారిపోయింది. విజయ్ కొత్త సినిమా ‘పులి’ విషయంలో వస్తున్న ఆఫర్లు చూస్తుంటే విజయ్ కి తెలుగులో ఇంత మార్కెట్ ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

‘పులి’ సినిమా తెలుగు వెర్షన్ బిజినెస్ ఓపెన్ చేయగానే ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చాయని.. రూ.7 కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఆశ్చర్యపోవాల్సిందే. జిల్లా సినిమాకు రూ.2 కోట్ల లోపే బిజినెస్ జరిగింది. ఒక్కసారిగా దానికి మూడు రెట్లకు పైనే రేటు పలకడమంటే చిన్న విషయం కాదు. ఇక్కడ విజయ్ తో పాటు చాలా ఫ్యాక్టర్లు కలిసొస్తున్నట్లున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి ముఖ్య పాత్ర పోషిస్తుండటం.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించడం.. సుదీప్ - శ్రుతి హాసన్ - హన్సిక కీలక పాత్రల్లో నటించడం వల్ల క్రేజ్ బాగా పెరిగినట్లుంది. ట్రైలర్ లో భారీ తనం కూడా సినిమాపై అంచనాలు పెంచింది. ఈ నేపథ్యంలోనే బిజినెస్ ఓ రేంజిలో జరుగుతున్నట్లుంది. కానీ అక్టోబరు 1న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటుండగా.. మరుసటి రోజు కంచె - సైజ్ జీరో - శివమ్ లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఇందులో కనీసం రెండైనా రిలీజ్ కావడం ఖాయం. మరి ఆ పోటీ మధ్య ‘పులి’ ఏమేరకు గాండ్రిస్తుందన్నదే డౌటు.