Begin typing your search above and press return to search.

ఈ అరవోళ్లకు ఇదేం అలవాటో..

By:  Tupaki Desk   |   20 Aug 2015 8:05 PM GMT
ఈ అరవోళ్లకు ఇదేం అలవాటో..
X
తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చే పైసలు కావాలి.. ఇక్కడి మార్కెట్ లో పాతుకుపోవాలి. కానీ ఇక్కడి ప్రేక్షకుల్ని గౌరవించడం మాత్రం తెలియదు తమిళ దర్శక నిర్మాతలకు. తమిళ సినిమాలకు ముందు నుంచి తెలుగులో మంచి ఆదరణ ఉంది. కొన్ని సినిమాలకు తమిళంతో సమానంగా తెలుగులో వసూళ్లు వస్తుంటాయి. ఇంతకుముందైతే ముందు తమిళంలో రిలీజ్ చేసి.. ఆ తర్వాత తెలుగులోకి తెచ్చేవాళ్లు కానీ.. ఈ మధ్య ఒకేసారి అక్కడా ఇక్కడా రిలీజ్ చేస్తున్నారు. ఇది బాగానే ఉంది కానీ.. ఈ ద్విభాషా చిత్రాల ట్రైలర్లు, ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసేటపుడు ఒకేసారి అటు తమిళంలో, ఇటు తెలుగులో రిలీజ్ చేయాలన్న ఆలోచన రావట్లేదు అరవోళ్లకు.

ముందు తమిళంలో ఫస్ట్ లుక్స్, ట్రైలర్లు వదిలేస్తున్నారు. ఐతే సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయిన ఈ రోజుల్లో అవి ముందే మన జనాలు చూసేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పటికో మొక్కుబడిగా తెలుగు వెర్షన్ లుక్స్, టీజర్స్, ట్రైలర్స్ రిలీజ్ చేయడం అలవాటైపోయింది. శంకర్ లాంటి వాడు సైతం ‘ఐ’ సినిమా విషయంలో ఇలాగే చేశాడు. మిగతా వాళ్లు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. విజయ్ ‘పులి’ సినిమాను తెలుగులోనూ భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ.. తమిళంలో ఫస్ట్ లుక్, ట్రైలర్ వచ్చిన ఎన్నో రోజులకు ఇక్కడ వదిలారు. తాజాగా త్రిష ‘నాయకి’ విషయంలోనూ ఇదే జరిగింది. ముందు తమిళ ఫస్ట్ లుక్ పోస్టర్లు వచ్చిన రెండు రోజుల తర్వాత తెలుగు పోస్టర్లు రిలీజ్ చేసి.. పండగ చేస్కోమంది త్రిష. అయినా పోస్టర్ల లో మారాల్సింది పేరొక్కటే కదా. అవి ఇవీ ఒకేసారి రిలీజ్ చేసి.. తెలుగు ప్రేక్షకులకూ తాము ప్రయారిటీ ఇస్తున్నట్లు చాటుకుంటే వీళ్ల సొమ్మేం పోతుందో? వసూళ్లు కావాలనుకున్నట్లు ఇది మాత్రం ఎందుకు చేయరు?