Begin typing your search above and press return to search.

పబ్లిక్ టాక్: 'శాకిని డాకిని' ఎలా ఉందంటే..?

By:  Tupaki Desk   |   16 Sep 2022 8:49 AM GMT
పబ్లిక్ టాక్: శాకిని డాకిని ఎలా ఉందంటే..?
X
ప్రతీ వారం మాదిరిగానే ఈ శుక్రవారం కూడా నాలుగు సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోడానికి బాక్సాఫీస్ బరిలో దిగాయి. అందులో ''శాకిని డానికి'' సినిమా ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వంలో నివేతా థామస్ మరియు రెజీనా కాసాండ్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది. సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిల్మ్స్ - క్రాస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దీనికి తగ్గట్టుగానే ఫస్ట్ డే ఆడియన్స్ నుంచి నెగెటివ్ టాక్ వస్తోంది.

కథలోకి వెళ్తే.. పోలీస్‌ ట్రైనింగ్ కోసం అకాడమీకి వచ్చిన శాలిని (నివేతా) మరియు దామిని (రెజీనా) మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వల్ల ప్రతీ విషయానికి గొడవ పడుతూ ఉంటారు. అయితే కొన్ని సంఘటనల తర్వాత ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఔటింగ్‌ కి బయటకు వెళ్లిన వీరిద్దరూ.. అనుకోకుండా ఓ అమ్మాయి కిడ్నాప్ అవ్వడాన్ని చూస్తారు. ఆమెను కాపాడే క్రమంలో ఈ కిడ్నాపుల వెనుక ఒక పెద్ద మాఫియా హస్తం ఉందని కనుక్కుంటారు. దీని వెనకున్నది ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇద్దరు మహిళా ట్రైనీలు కలసి ఏం చేశారు? అనేది 'శాకిని డాకిని' సినిమా.

'మిడ్ నైట్ రన్నర్స్' అనే సౌత్ కొరియన్ యాక్షన్ చిత్రానికి తెలుగు రీమేక్ గా 'శాకిని డాకిని' తెరకెక్కింది. కథా నేపథ్యం.. పాత్రల చిత్రీకరణ పరంగా పర్వాలేదనిపించాయి. కానీ సినిమా ఎంగేజింగ్ గా లేదని.. మెయిన్ పాయింట్ ని ఆసక్తికరంగా చెప్పలేకపోయారని.. బోరింగ్ గా ఉందని సినిమా చూసిన ఆడియన్స్ అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగినప్పటికీ అక్కడక్కడా ఓకే అనిపిస్తుందని.. కానీ సెకండాఫ్ పూర్తిగా డిజప్పాయింట్ చేసిందని చెబుతున్నారు. టేకింగ్ బాగుంది తప్ప.. సినిమాలో విషయం లేదని కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్‌ అయ్యిందని నెటిజన్లు పేర్కొన్నారు.

కథలో ఎక్కడా ట్విస్టులు టర్నింగ్ పాయింట్లు కూడా లేకుండా.. చివరి వరకూ సింగిల్ ప్లాట్ తో బోరింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించారని అంటున్నారు. ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో ఎలాంటి బలమైన సంఘర్షణ లేకుండా నడవడంతో.. ఆడియన్స్ కు కనెక్ట్ అవలేదని అభిప్రాయ పడుతున్నారు. ఇది కేవలం ఓటీటీ మూవీ అని పేర్కొంటున్నారు.

అయితే హీరోయిన్లు రెజీనా - నివేదా ఇద్దరూ తమ టైమింగ్ తో అలరించారని.. యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నారని కామెంట్స్ పెడుతున్నారు. ఇద్దరి నటన చాలా సహజంగా అనిపిస్తుందని అంటున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ స్క్రిప్ట్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి సుధీర్ వర్మ ఈ సినిమాని ఎక్కడా ప్రమోట్ చేయలేదు. సెకండ్ హాఫ్ లో ఆయనకు తెలియకుండా మరో దర్శకుడి సలహా మేరకు మార్పులు చేసారని.. ఈ నేపథ్యంలో నిర్మాతలతో విబేధాలు తలెట్టాయని టాక్ వచ్చింది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సెకండాఫ్ మరీ బోరింగ్ గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నా.. విజువల్స్ ను హైలెట్ చేసే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లేదని అంటున్నారు. నిర్మాణ విలువలు కూడా ఫస్టాఫ్ వరకూ బాగున్నా.. మిగతా సగం మీద అంతగా ఫోకస్ పెట్టలేదనిపిస్తుందని నెటిజన్లు పేర్కొన్నారు. ఓవరాల్ గా 'శాకిని డాకిని' సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని.. ఓటీటీలో మాత్రమే చూడగలిగే మూవీ అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.