Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ - పొన్నియన్ సెల్వన్ 2

By:  Tupaki Desk   |   28 April 2023 4:00 PM
మూవీ రివ్యూ - పొన్నియన్ సెల్వన్ 2
X
మూవీ రివ్యూ : పొన్నియన్ సెల్వన్ 2

నటీనటులు: విక్రమ్-జయం రవి-కార్తి-ఐశ్వర్యా రాయ్-త్రిష-ప్రకాష్ రాజ్-శరత్ కుమార్-కిషోర్-పార్తీబన్-శోభిత దూళిపాళ-ఐశ్వర్యా లక్ష్మి-విక్రమ్ ప్రభు-లాల్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: రవివర్మన్
మాటలు: తనికెళ్ల భరణి
నిర్మాతలు: సుభాస్కరన్-మణిరత్నం
స్క్రీన్ ప్లే: మణిరత్నం-జయమోహన్-కుమారవేల్
దర్శకత్వం: మణిరత్నం

గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన మణిరత్నం మాగ్నమ్ ఓపస్ 'పొన్నియన్ సెల్వన్' తమిళంలో ఘనవిజయమే సాధించినా.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అది రుచించలేదు. మధ్యలో ఆగిన ఆ కథను కొనసాగిస్తూ ఇప్పుడు 'పొన్నియన్ సెల్వన్-2'తో వచ్చాడు మణిరత్నం. మరి ఈ చిత్రమైనా మెప్పించేలా ఉందా? మణిరత్నం ఈసారైనా మ్యాజిక్ చేశాడా? తెలుసుకుందాం పదండి.

కథ:

చోళరాజ్యాన్ని పరిపాలించే సుందర చోళుడి (ప్రకాష్ రాజ్) చిన్న కొడుకైన అరుణ్మొళి వర్మన్ (జయం రవి) పాండ్యులు జరిపిన దాడిలో దెబ్బ తిని సముద్రంలో మునిగి చనిపోయినట్లు వార్త అందగానే చోళ రాజ్యంలో అలజడి మొదలవుతుంది. అరుణ్మొళి సోదరుడు కరికాలుడు (విక్రమ్).. సోదరి కుందవి (త్రిష) శోకంలో మునిగిపోతారు. కానీ వన దేవత లాగా సముద్ర తీరంలో ఉండే మందాకిని అతణ్ని రక్షించి ఒడ్డుకు చేరుస్తుంది.

తన మిత్రుడైన వందియ దేవుడు (కార్తి) సాయంతో ఒక బౌద్ధ క్షేత్రానికి చేరి ఆరోగ్యవంతుడిగా మారతాడు అరుణ్మొళి. కానీ అతణ్ని ఎలాగైనా మట్టుబెట్టాలని పాండ్యుల ప్రయత్నాలు కొనసాగుతాయి. మరోవైపు కరికాలుడిని ఎలాగైనా చంపి చోళ రాజ్యాన్ని కూల్చాలనే లక్ష్యంతో నందిని (ఐశ్వర్యారాయ్) తన కుట్రలను కొనసాగిస్తుంది. మరి వీరి ప్రయత్నాలు ఎంతమేర ఫలించాయి.. చివరికి చోళ రాజ్యం ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

భారత దేశ సినీ చరిత్రలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఆయనకు మాస్టర్ స్టోరీ టెల్లర్ అనే పేరు ఊరికే రాలేదు. మణిరత్నం సినిమాల బాక్సాఫీస్ ఫలితాలను పక్కన పెడితే.. ఏ కథ ఎంచుకున్నా దాన్ని ఆసక్తికర కథనంతో కట్టిపడేసేలా తెర మీద ప్రెజెంట్ చేయడంలో మణిరత్నం నైపుణ్యమే వేరు. అలాంటి దర్శకుడు తమిళ సాహిత్య చరిత్రలోనే అత్యుత్తమ నవలల్లో ఒకటిగా పేరున్న 'పొన్నియన్ సెల్వన్'ను వెండి తెరపైకి తీసుకురావాలని దశాబ్దాల పాటు కలలు కని.. చివరికి కొన్నేళ్ల ముందు ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. గత ఏడాది 'పొన్నియన్ సెల్వన్' తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఐతే తమిళ ప్రేక్షకుల సంగతేమో కానీ.. తెలుగు వారికి మాత్రం 'పొన్నియన్ సెల్వన్' నిజంగా అంత గొప్ప నవలా అన్న సందేహాలు రేకెత్తేలా చేసిందీ సినిమా. సినిమా అంతా అయ్యాక కూడా అసలు మనం చూసిన కథ ఏంటో చెప్పమని ఎవరైనా అడిగితే.. పాత్రల గురించి వివరించమంటే తడబడి నోట మాట రాని పరిస్థితి కల్పించిందా చిత్రం. అంత గందరగోళంగా.. గజిబిజిగా మణిరత్నం ఆ కథను నరేట్ చేశాడని చెప్పడానికి మొహమాట పడాల్సిన పని లేదు. తెర నిండా బోలెడన్ని పాత్రలు.. రకరకాల పేర్లు.. ఎవరి ఉద్దేశాలేంటో.. ఎవరి నేపథ్యాలేంటో.. ఎవరు మంచి వాళ్లో ఎవరు చెడ్డవాళ్లో.. ఎవరికి వ్యతిరేకంగా ఎవరు ఎందుకు కుట్ర పన్నుతున్నారో అర్థం కాని గందరగోళంలో కథను.. పాత్రలను అర్థం చేసుకోవడమే పెద్ద పరీక్షగా మారిన ఆ సినిమాలో ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచిన ఎపిసోడ్లు పరిమితం. మధ్యలో ఆగిన ఆ కథను కొనసాగిస్తూ ఇప్పుడు వచ్చిన 'పొన్నియన్ సెల్వన్-2' కూడా అందుకు భిన్నమేమీ కాదు.

'పొన్నియన్ సెల్వన్-1' చూసి సంతృప్తి చెంది ఉంటే.. ఈ రెండో భాగం కూడా నచ్చుతుంది. అది నచ్చని వాళ్లకు ఇది కూడా పెద్ద పరీక్షే అవుతుంది. కాకపోతే తొలి భాగంలో జవాబు లేని ప్రశ్నలకు ఇందులో కొంత మేర సమాధానాలు లభిస్తాయి. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసి ఉండటం.. రెండో భాగంలో ఎక్కువసార్లు పేర్లు వినడం వల్ల కొన్ని పాత్రల మీద ఒక అవగాహన వస్తుంది. అలాగే కథ కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది. అలా అని జవాలు లేని ప్రశ్నలు లేవా అంటే.. అదేమీ లేదు. కథను నరేట్ చేసే విషయంలో అదే గందరగోళ శైలిని మణిరత్నం కొనసాగించడంతో రెండో భాగం ముగిశాక కూడా అసలు ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారనే ప్రశ్న తలెత్తుతుంది.

'పొన్నియన్ సెల్వన్' నవల చదివిన వాళ్లు పక్కనే కూర్చుని ప్రతి ఎపిసోడ్ తర్వాత వివరణ ఇస్తూ ఉంటే ఈ సినిమా బాగా అర్థమవుతుందేమో అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లాగే.. రెండో భాగాన్ని కూడా ఆల్రెడీ 'పొన్నియన్ సెల్వన్' చదివిన వాళ్ల కోసం తీసినట్లే తీశాడు మణిరత్నం. ఈ కథ తెలిసిన వాళ్లకైనా సరే.. తెర మీద ఈ సినిమా చూస్తున్నపుడు నవలలోని గొప్పదనం అంతా తెర మీదికి తర్జుమా అయినట్లు ఫీలవుతారా అనేది సందేహం. ఎందుకంటే ఎలాగోలా కష్టపడి ఈ కథను అర్థం చేసుకున్నా సరే.. ఏముంది ఇందులో అంత విశేషం అనిపిస్తుంది సినిమా అంతా అయ్యాక.

ఎంత కాదనుకున్నా ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు చూస్తున్నపుడు రాజమౌళి తీసిన 'బాహుబలి' గుర్తుకు రావడం సహజం. అందులో పాత్రలను ఎలివేట్ చేసిన విధానం.. ఏ గందరగోళం లేకుండా కథను నరేట్ చేసిన తీరు.. కథనంలోని బిగి.. భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లిన తీరు.. ఆ విజువల్స్.. అందులోని యాక్షన్ ఘట్టాలు.. వీటిన్నటితో పోల్చుకుని చూస్తే తెలుగు ప్రేక్షకులకు 'పొన్నియన్ సెల్వన్' రుచించడం చాలా కష్టం. మణిరత్నం శైలి వేరన్నది వాస్తవమే కానీ.. ఆయన శైలిలో ఇంతకుముందు మనం చూసిన సినిమాలతో పోల్చుకున్నా 'పొన్నియన్ సెల్వన్' నిలవజాలదు.

రవి వర్మన్ విజువల్స్.. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం.. అద్భుతమైన ఆర్ట్ వర్క్.. ఇలాంటి సాంకేతిక ఆకర్షణలతో కొన్ని సన్నివేశాలతో కనెక్ట్ అవుతామే తప్ప కథన పరంగా ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచడంలో 'పొన్నియన్ సెల్వన్' పెద్దగా సక్సెస్ కాలేదు. అరుణ్మొళి బౌద్ధ క్షేత్రం నుంచి బయటికి వచ్చి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను తిప్పి కొట్టే ఒక ఎపిసోడ్.. అలాగే ఆఖర్లో వచ్చే యుద్ధ సన్నివేశం కాస్త మెరుగ్గా అనిపిస్తాయి. అవి బాహుబలి శైలిలో నడవడం గమనార్హం. అందుకే వాటికి కనెక్ట్ కాగలుగుతాం. ఇవి కాకుండా కొంచెం ప్రత్యేకంగా అనిపించేది విక్రమ్-ఐశ్వర్యా ఫేసాఫ్ ఎపిసోడ్. కొంచెం లెంగ్తీగా సాగినప్పటికీ ఈ ఎపిసోడ్ బాగుంది. మిగతా కథనమంతా చాలా వరకు విసిగిస్తుంది. ముందే అన్నట్లు 'పొన్నియన్ సెల్వన్-1' చూసి ఇంప్రెస్ అయినా.. లేదా ఈ కథను పూర్తి చేయాలనే ఉద్దేశం ఉన్నా 'పొన్నియన్ సెల్వన్-2' చూడొచ్చు. అంతకుమించి ఎక్కువ అంచనాలు పెట్టుకోకుంటే మంచిది.

నటీనటులు:

తొలి భాగంతో పోలిస్తే ఇందులో జయం రవి హైలైట్ అయ్యాడు. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. నటన ఆకట్టుకుంటుంది. అతడి నేపథ్యంలోనే ఈ కథ ముగుస్తుంది. విక్రమ్ కనిపించినంతసేపూ తన ముద్రను చూపించాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఐశ్వర్యా రాయ్ నటన ఓకే కానీ.. వయసు ప్రభావం కనిపించకుండా వేసిన అతి మేకప్ ఇబ్బంది పెడుతుంది. కళ్లతో హావభావాలు కనిపించినా.. ముఖం మాత్రం చాలా వరకు ముభావంగానే పెట్టింది. త్రిష చాలా అందంగా.. ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె కనిపించినపుడు చూపు తిప్పుకోలేం. కార్తీ తన చలాకీ నటనను కొనసాగించాడు. అక్కడక్కడా అతడి పాత్రే రిలీఫ్ ఇస్తుంది. ప్రకాష్ రాజ్.. శరత్ కుమార్ లకు చాల ా తక్కువ స్క్రీన్ టైం దొరికింది. వాళ్లు బాగానే చేశారు. కిషోర్.. జయరాం.. రెహమాన్.. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'పొన్నియన్ సెల్వన్-2' లాగే రెండో భాగం కూడా ఉన్నతంగా అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్. ప్రపంచ స్థాయి ఔట్ పుట్ ఇచ్చాడు రెహమాన్. ఇందులో పెద్ద పాటలేం లేవు. చిన్న చిన్న బిట్ సాంగ్స్ అలా అలా వచ్చి వెళ్తుంటాయి. రవివర్మన్ ఛాయాగ్రహణం.. తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ అవార్డ్ విన్నింగ్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా కనిపించేలా వారి కృషి సాగింది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. జయమోహన్ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడిగా మణిరత్నం మాత్రం మళ్లీ నిరాశ పరిచాడు. సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా కథను చెప్పకపోవడం లోపమే అవుతుంది. ఏదీ విడమరిచి చెప్పడం మణిరత్నం శైలి కాదు. కానీ ఆయన శైలిని బాగా ఇష్టపడేవారిని కూడా 'పొన్నియన్ సెల్వన్' మెప్పించడం కష్టమే. గతంలో ఆయన సినిమాలు చూసి ఏం తీశాడయ్యా అని అబ్బురపడేలా 'పొన్నియన్ సెల్వన్' లేదన్నది వాస్తవం.

చివరగా: పొన్నియన్ సెల్వన్-2.. కొంత రసవత్తరం.. ఎంతో నీరసం

రేటింగ్ - 2.25/5