Begin typing your search above and press return to search.

కంటెంటే కింగ్ అని మరోసారి ప్రూవ్ అయింది..!

By:  Tupaki Desk   |   6 Aug 2022 4:39 AM GMT
కంటెంటే కింగ్ అని మరోసారి ప్రూవ్ అయింది..!
X
పాండమిక్ తర్వాత వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి మాత్రం కనిపించలేదు. వారం వారం సరికొత్త చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి కానీ.. విజయాలు మాత్రం దక్కడం లేదు. ముఖ్యంగా గత ఆరేడు వారాలుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జనాలు లేక సినిమా హాళ్లు వెలవెలబోయాయి. ఇండస్ట్రీకి ఇలాంటి దుస్థితి ఏర్పడటానికి కారణాలు ఏంటని షూటింగ్స్ బంద్ చేసి మరీ అన్వేషిస్తున్న తరుణంలో.. నిన్న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మరియు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ చేసిన 'సీతా రామం' సినిమాలు శుక్రవారం థియేటర్లలోకి వచ్చాయి. రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేయడంతో.. ఈ రెండు సినిమాలపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని ప్రతీ ఒక్కరు కోరుకున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రాలు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

'బింబిసార' సినిమానికి మాస్ సెంటర్లలో అద్భుతమైన టాక్ వస్తే.. క్లాస్ సెంటర్లలో 'సీతా రామం' చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కుతోంది. దీంతో చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి కనిపిస్తోంది. ఒక్క సినిమా హిట్టయినా చాలు అనుకుంటున్న తరుణంలో రెండింటికీ అనూహ్యమైన స్పందన లభిస్తోంది. గత కొన్ని వారాల్లో ఏ సినిమాకి కూడా ఇలాంటి టాక్ రాలేదనే చెప్పాలి.

ఏ ఇండస్ట్రీ అయినా సక్సెస్ ఫార్ములాను నమ్ముకుంటుంది.. ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ ఫార్ములానే ఎక్కువ మంది ఇష్టపడతారని భావిస్తుంది. అందుకే క్రేజీ కాంబినేషన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. టాలీవుడ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఇలాంటి అంశాలతో పాటుగా సరైన కంటెంట్ ఉంటేనే సినిమాలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు 'సీతా రామం' & 'బింబిసార' చిత్రాలు ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాయి.

ఇటీవల కాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం.. నిర్మాతల పెట్టుబడి వెనక్కి రాకపోవడంతో.. పరిశ్రమను కాపాడేందుకు రకరకాల మార్గాలను అన్వేషింసచడానికి.. ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించడానికి టాలీవుడ్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'బింబిసార' 'సీతా రామం' సినిమాల ఫలితాలను విశ్లేషిస్తే.. టాలీవుడ్ ఇలాంటి స్థితికి ఎందుకు వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తుందని సినీ అభిమానులు సూచిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్స్ - స్టార్ హీరోల డేట్స్ కోసం - అవసరానికి మించి ఖర్చు చేయడం గురించి కాకుండా.. సరైన కంటెంట్ తో సినిమాలు తీయాలని అంటున్నారు. రొటీన్ మసాలా కంటెంట్‌ లేదా జీవం లేని కథలతో పేలవమైన కంటెంట్ తో వచ్చి.. ప్రేక్షకులు థియేటర్లకు రావాలని కోరుకోవడం అత్యాశ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నాయి.. ఎంతో అద్భుతమైన సినిమా వస్తే తప్ప ప్రేక్షకులు ఆదరించడం లేదు అని అంటున్నారు. కానీ ప్రేక్షకులు మంచి సినిమాని తప్పకుండా ఆదరిస్తారని నాకు తెలుసు' అని అన్నారు. ఇది వంద శాతం నిజమని 'బింబిసార' మరియు 'సీతా రామం' చిత్రాలు నిరూపించాయి.

ప్రమోషనల్ కంటెంట్ తో జనాల దృష్టిని ఆకర్షించడమే కాదు.. సినిమాలోనూ గొప్ప కంటెంట్ మరియు కొత్తదనం ఉండాలనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఎప్పుడైనా సరే కంటెంటే కింగ్ అని ఈ రెండు చిత్రాలతో మరోసారి ప్రూవ్ అయింది. మరి టాలీవుడ్ ప్రముఖులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని.. విజయం వరిస్తుందని సినీ అభిమానులు సూచిస్తున్నారు.